ఇద్దరూ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బు ఎవరికి వెళ్తుంది?

Insurance Claim : ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నవారు చనిపోతే వారు నామినేట్ చేసిన వ్యక్తి ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ, క్లెయిమ్ చేసే ముందు నామినీ కూడాచనిపోతే? లేదా పాలసీదారు, నామినీ ఇద్దరూ ఒకేసారి చనిపోతే ఏమి జరుగుతుంది? ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది? ఎవరు క్లెయిమ్ చేయడానికి చట్టబద్ధంగా అర్హులు? ఈ విషయాలు చాలా మందికి తెలియవు.

ఇన్సూరెన్స్ పాలసీలో నామినీ విషయంలో ఉన్న నియమాలు

ఇన్సూరెన్స్ పాలసీదారు చనిపోయినప్పుడు నామినీ ఆ డబ్బు కోసం క్లెయిమ్ చేయవచ్చు. పాలసీదారు , నామినీ ఇద్దరూ చనిపోతే, చట్టం ప్రకారం ఆ ఇన్సూరెన్స్ డబ్బు పాలసీదారు చట్టబద్ధమైన వారసులకు చెందాలి. ఒకవేళ పాలసీదారు వీలునామా రాసి ఉంటే, ఆ వీలునామా ప్రకారం ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ డబ్బు వెళ్తుంది. వీలునామా లేకపోతే, భారత వారసత్వ చట్టం కింద ఉన్న నిబంధనలు వర్తిస్తాయి. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులైన భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఇన్సూరెన్స్ డబ్బు పంచుకోవచ్చు.

ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు నామినీని నియమించడం తప్పనిసరి. ఒకరిని మాత్రమే నామినీగా నియమించాలనే పరిమితి లేదు. ఒకటి కంటే ఎక్కువ మందిని నామినీలుగా నియమించవచ్చు. భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులను కూడా నామినీలుగా చేర్చవచ్చు. ఏ నామినీకి ఎంత శాతం వాటా వెళ్ళాలి అనేది కూడా నిర్దిష్టంగా చెప్పవచ్చు. ఉదాహరణకు, ఇన్సూరెన్స్ డబ్బులో 50 శాతం భార్యకు, 25 శాతం, 25 శాతం ఇద్దరు పిల్లలకు వెళ్ళాలి అని నామినీని నియమించేటప్పుడే పేర్కొనవచ్చు.

పాలసీ వ్యవధిలో నామినీని మార్చవచ్చా?

మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత ఒక నామినీని నియమిస్తారు. ఒకవేళ ఆ నామినీ చనిపోతే, లేదా ఆ నామినీకి డబ్బులు వెళ్లడం మీకు ఇష్టం లేకపోతే, మరొక నామినీ పేరును చేర్చడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మార్పులు పాలసీదారు జీవించి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story