చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ 17 సంచలనం

iPhone 17 : ఆపిల్ సంస్థకు చైనా మార్కెట్‌లో ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆపిల్ విడుదల చేసిన కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన ఐఫోన్ 17, చైనాలో కంపెనీ అదృష్టాన్ని మార్చేసింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్ అందుబాటులోకి వచ్చిన మొదటి నెలలోనే చైనాలో ఐఫోన్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 22 శాతం పెరిగాయి. గత సంవత్సరం ఐఫోన్ 16 విడుదల తర్వాత అమ్మకాలు పడిపోయిన ఆపిల్‌కు ఇది చాలా పెద్ద పురోగతిని సూచిస్తోంది.

తాజా లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 19 తర్వాత చైనీస్ కస్టమర్‌లకు అమ్ముడైన మొత్తం ఐఫోన్‌లలో సుమారు 4/5 వ వంతు ఐఫోన్ 17 సిరీస్‌దే. ఈ వృద్ధి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల Q4 2025 ఆదాయ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఉంది. చైనాలో లభించిన స్పందన పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని టిమ్ కుక్ అన్నారు. ఈ ప్రాంతంలో చాలా కాలంగా తక్కువ అమ్మకాల తర్వాత, కొత్త సిరీస్‌కు చాలా మంచి స్పందన లభించిందని, ఇది ప్రస్తుత త్రైమాసికంలో ఆపిల్‌ను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకువెళ్తుందని ఆయన పేర్కొన్నారు.

టీమ్ కుక్ చెప్పిన దాని ప్రకారం గత త్రైమాసికంలో ఏమైనా అమ్మకాలు తగ్గితే దానికి కారణం తక్కువ డిమాండ్ కాదు. సరఫరా కొరత మాత్రమే అని స్పష్టం చేశారు. కొత్త డివైజ్‌ల కొనుగోలుకు కస్టమర్లు ప్రభుత్వ రాయితీలపై ఆధారపడకుండానే వేగంగా వృద్ధి చెందడం గమనించదగిన విషయం అని ఆయన వివరించారు. కౌంటర్‌పాయింట్ నివేదిక ఈ విషయాన్ని బలపరుస్తుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇదే సమయంలో మొత్తం చైనీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2.7 శాతం పడిపోయింది. మార్కెట్ క్షీణించినప్పటికీ ఆపిల్ మాత్రం తన కొత్త మోడళ్ల కారణంగా బలమైన వృద్ధిని నమోదు చేసింది.

పోలిక కోసం చూస్తే గత సంవత్సరం ఐఫోన్ 16 విడుదలైన తర్వాత మొదటి నెలలో అమ్మకాలు 5 శాతం పడిపోయాయి. ఇప్పుడు ఏకంగా 22 శాతం పెరగడం ఈ వృద్ధి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఐఫోన్ 17 సిరీస్ సాధించిన ఈ విజయం ఆపిల్ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, కంపెనీకి అత్యంత కఠినమైన మార్కెట్‌లలో ఒకటైన చైనాలో ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. చైనాలో స్థిరమైన వృద్ధిని తిరిగి సాధించాలనే లక్ష్యంతో ఆపిల్ ముందుకు సాగుతోంది. ఈ కొత్త లెక్కలు ఆపిల్ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లు సరైన సమయంలో మార్కెట్‌లోకి వచ్చాయని నిరూపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story