iPhone Duo: స్మార్ట్‌ఫోన్ లవర్లకు బిగ్ సర్ ప్రైజ్.. లాంచ్ అయిన ఐఫోన్ డ్యూయో
ఐఫోన్ డ్యూయో

iPhone Duo: టెక్ లవర్స్ ఏళ్ల తరబడి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ ఎట్టకేలకు గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. అత్యంత ఖరీదైన ధరకు విడుదలైన ఈ ప్రీమియం డివైజ్, తన స్ట్రాంగ్ ఈకోసిస్టమ్‌తో ఫోల్డబుల్ ఫోన్ల విభాగాన్ని పూర్తిగా మార్చేయడానికి సిద్ధమైంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో ఆపిల్ నడిచే దారే వేరు. ఏదైనా కొత్త టెక్నాలజీ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు మొదట్లోనే ఆ పరుగు పందెంలో దూకదు. ఇతర కంపెనీలు ఆ టెక్నాలజీలోని లోపాలను సరిదిద్ది, మార్కెట్‌ను సిద్ధం చేసే వరకు వెయిట్ చేస్తుంది. వినియోగదారులకు దానిపై పూర్తి నమ్మకం కుదిరాక, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులతో ఎంట్రీ ఇచ్చి రూల్స్ మార్చేస్తుంది. ఇప్పుడు ‘ఐఫోన్ డ్యూయో’ విషయంలోనూ ఆపిల్ సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర 1,999 డాలర్లు కాగా, భారత మార్కెట్‌లో దీని ధరను రూ.2,99,900గా నిర్ణయించారు.
అదరగొట్టే డిజైన్, మల్టీటాస్కింగ్ ఫీచర్లు
కొత్తగా వచ్చిన ఐఫోన్ డ్యూయో బేస్ 256 జీబీ మోడల్‌లో 7.6 అంగుళాల మెయిన్ ఇన్నర్ స్క్రీన్, వెలుపల 5.4 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ ఫోల్డ్ అయ్యే హింజ్ డిజైన్, మందం తగ్గించడంపై ఆపిల్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. వేర్వేరు కోణాల్లో ఫోన్‌ను మడతపెట్టి అనేక పనులు ఒకేసారి చేసుకునేలా మల్టీటాస్కింగ్ అనుభవాన్ని మెరుగుపరిచారు. మునుపటి అంచనాల ప్రకారం ఈ ఫోన్ ధర 2,000 డాలర్లు దాటుతుందని భావించినప్పటికీ, పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చేలా ఆపిల్ దీని ధరను 1,999 డాలర్ల వద్దే నిలిపింది.
శామ్‌సంగ్, హువావేల స్థానాలకు సవాల్
ఫోల్డబుల్ విభాగంలో శామ్‌సంగ్ ఏళ్ల తరబడి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ స్థానాన్ని వెంటనే భర్తీ చేయడం ఆపిల్‌కు అంత తేలిక కాదు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఫోల్డబుల్ మార్కెట్ అయిన చైనాలో హువావే ఏకంగా 80 శాతం వాటాతో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఆపిల్ లేకపోవడంతో ఆ రెండు కంపెనీలు సత్తా చాటాయి. ఇప్పుడు ఐఫోన్ డ్యూయో రాకతో హువావే, శామ్‌సంగ్‌ల బలానికి గట్టి గండి పడటం ఖాయంగా కనిపిస్తోంది.
మొదటి ఏడాదిలోనే రూ.2.2 లక్షల కోట్లకు పైగా ఆదాయం?
ఐఫోన్ డ్యూయో రాకతో ఆపిల్ బిజినెస్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ అంచనాల ప్రకారం.. లాంచ్ అయిన మొదటి 12 నెలల్లోనే ఆపిల్ కోటి వరకు ఐఫోన్ డ్యూయో యూనిట్లను విక్రయించే అవకాశం ఉంది. దీనిద్వారా దాదాపు 27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.25 లక్షల కోట్లు) ఆదాయం సమకూరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేగం ఇలాగే కొనసాగితే, రాబోయే మూడేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా ఫోల్డబుల్ ఫోన్లు విక్రయించే బ్రాండ్‌గా ఆపిల్ నిలుస్తుందని విశ్లేషిస్తున్నారు.

