IPO Rush : ఐపీఓ ఇన్వెస్టర్లకు పండగే.. ఈ వారం నాలుగు కొత్త ఐపీఓలు, 15 కంపెనీల లిస్టింగ్
ఈ వారం నాలుగు కొత్త ఐపీఓలు, 15 కంపెనీల లిస్టింగ్

IPO Rush : డిసెంబర్ మూడవ వారం పెట్టుబడిదారులకు నిమిషం కూడా తీరిక లేకుండా చేయనుంది. మీరు ప్రైమరీ మార్కెట్, అంటే ఐపీఓలలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ఈ వారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకవైపు నాలుగు కొత్త కంపెనీలు తమ ఐపీఓలను తీసుకువస్తుండగా మరోవైపు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ముగించుకున్న పదిహేను కంపెనీలు ఈ వారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ట్రేడింగ్‌ను ప్రారంభించబోతున్నాయి.
ఈ వారంలో అతిపెద్ద ఆకర్షణ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ మెయిన్‌బోర్డ్ ఐపీఓ. ఈ ఇష్యూలో పెట్టుబడిదారులు డిసెంబర్ 16 నుంచి బిడ్లు వేయవచ్చు, ఇది డిసెంబర్ 18 వరకు తెరిచి ఉంటుంది. కంపెనీ తన విస్తరణ ప్రణాళికల కోసం మార్కెట్ నుంచి రూ.710 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.420 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేస్తుండగా, మిగిలిన రూ. 290 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది. ఈ ఐపీఓ ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 365 నుంచి రూ. 384గా నిర్ణయించారు.
క్యూలో మూడు ఎస్‌ఎంఈ ఐపీఓలు
పెద్ద కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా ఈ వారం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముందుగా డిసెంబర్ 15న నెప్ట్యూన్ లాజిటెక్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. రూ. 46.62 కోట్ల విలువైన ఈ ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ. 126 గా ఉంది. అయితే, రిటైల్ పెట్టుబడిదారులు కనీసం రెండు లాట్‌లకు (మొత్తం 2000 షేర్లు) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే డిసెంబర్ 17 నుంచి మరో రెండు కంపెనీల ఐపీఓలు మార్క్ టెక్నోక్రాట్స్, గ్లోబల్ ఓషన్ లాజిస్టిక్స్ ఇండియా సబ్‌స్క్రిప్షన్‌కు తెరవబడతాయి. మార్క్ టెక్నోక్రాట్స్ ధరల శ్రేణి రూ. 88–93 కాగా, గ్లోబల్ ఓషన్ ధర రూ. 74–80గా ఉంది. గ్లోబల్ ఓషన్ విషయంలో కూడా రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 3200 షేర్లకు (రెండు లాట్‌లకు సమానం) దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.
పెట్టుబడి పెట్టడానికి మాత్రమే కాకుండా ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల ఫలితాలు చూడటానికి కూడా ఈ వారం కీలకమైనది. ఈ వారంలో మొత్తం 15 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. డిసెంబర్ 15న మెయిన్‌బోర్డ్ విభాగంలో వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్, కరోనా రెమెడీస్ లిస్టింగ్ అవుతాయి వీటిపై మార్కెట్ ప్రత్యేక దృష్టి ఉంది. అలాగే, డిసెంబర్ 17న నెఫ్రోకేర్ హెల్త్, పార్క్ మెడీ వరల్డ్ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాయి.
ఎస్‌ఎంఈ రంగంలో కూడా లిస్టింగ్‌ల తాకిడి ఎక్కువగా ఉంది. డిసెంబర్ 15న కే.వీ. టాయ్స్, రిద్ధి డిస్‌ప్లే వంటి కంపెనీలు లిస్ట్ అవుతాయి. ఇక డిసెంబర్ 19 నాటికి స్టాన్‌బిక్ అగ్రో, అశ్వినీ కంటైనర్ మూవర్స్ వంటి షేర్లు కూడా మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయి.

