Petrol Price: ఇరాన్‌లో పెట్రోల్ బాంబు.. 110 లీటర్లు దాటితే బాదుడే బాదుడు
బాదుడే బాదుడు

Petrol Price: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అమెరికా కఠిన ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ ప్రభుత్వం ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. దేశంలో పెట్రోల్ ధరలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. నెలకు 110 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం వాడే వాహనదారులపై ఈ కొత్త ధరల భారం తీవ్రంగా పడనుంది. ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతెమే మొహజేరానీ తెలిపిన వివరాల ప్రకారం.. నెలకు 110 లీటర్ల పరిమితి దాటి పెట్రోల్ వాడే వారిపైనే ఈ అదనపు భారం పడుతుంది. దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మూడు అంచల కోటా విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం మొదటి 60 లీటర్ల వరకు లీటరు పెట్రోల్ ధర 15,000 రియాళ్లుగానే ఉంటుంది. ఆ తర్వాత వాడే మరో 50 లీటర్లకు లీటరుకు 30,000 రియాళ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా 110 లీటర్ల కోటా పూర్తయిన తర్వాత వాడే ప్రతి లీటరు పెట్రోల్‌కు ఏకంగా 100,000 ఇరానియన్ రియాళ్లు వసూలు చేయనున్నారు.
కఠిన నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా ఆర్థిక ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఖజానాపై పెరుగుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఒపెక్ సంస్థలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ, దేశీయంగా పెరుగుతున్న ఇంధన వినియోగాన్ని నియంత్రించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. దేశంలో సబ్సిడీ భారాన్ని తగ్గించి రాబడిని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తిరగబడతారనే భయంతో జాగ్రత్తలు
ఇరాన్‌లో ఇంధన ధరల పెంపు అనేది ఎప్పుడూ అత్యంత సున్నితమైన అంశంగానే ఉంటుంది. గతంలో 2019లో ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్ ధరలను పెంచినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించారు. నాటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈసారి సాధారణ వినియోగదారులకు మినహాయింపునిచ్చారు. కేవలం ఎక్కువ ఇంధనాన్ని వాడే ధనిక, రవాణా వర్గాలపైనే ఈ అదనపు భారాన్ని మోపినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రపంచంలోనే చవకైన పెట్రోల్
ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ లభించే దేశాల్లో ఇరాన్ ఒకటిగా ఉంది. మూడో కోటా కింద పెంచిన 100,000 రియాళ్ల ధర అంతర్జాతీయ ఉచిత మార్కెట్ విలువ ప్రకారం కేవలం 4 అమెరికన్ సెంట్లకు సమానం. అయినప్పటికీ స్థానిక రూపాయి విలువ పతనం కావడం, నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో ఈ పెంపు సామాన్యుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

