IRCTC: భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. చరిత్రలోనే మొదటిసారిగా ఒకే రోజులో 20 లక్షలకు పైగా రిజర్వుడు టికెట్లు బుక్ అయి పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆధునిక సాంకేతిక మార్పులు, ఫేక్ ఐడీల వేటుతో వ్యవస్థ అత్యంత వేగవంతంగా మారింది. రాబోయే పండగల సీజన్ దృష్ట్యా అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిలో ప్రయాణికులు టికెట్ల కోసం ఎగబడ్డారు. అందుబాటులోకి వచ్చిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 7న ఒక్కరోజే ఏకంగా 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. మరుసటి రోజు కూడా దాదాపు 19.50 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. గతంలో నమోదైన 18.40 లక్షల అత్యధిక బుకింగ్ రికార్డును ఈ గణాంకాలు అధిగమించాయి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ప్రయాణికులు రైల్వే స్టేషన్ల కౌంటర్ల వైపు చూడటం తగ్గించేశారు.

89 శాతం టికెట్లు డిజిటల్ మయం

ప్రస్తుతం జరుగుతున్న మొత్తం రిజర్వేషన్లలో ఏకంగా 89 శాతం టికెట్లు ఆన్‌లైన్ ద్వారానే నమోదు కావడం విశేషం. కేవలం 11 శాతం మంది మాత్రమే ఆఫ్ లైన్ కౌంటర్లలో టికెట్లు తీసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా వెబ్‌సైట్ సామర్థ్యాన్ని పెంచేందుకు పాత సర్వర్ల స్థానంలో నూతన హై-స్పీడ్ సర్వర్లను అమర్చారు. జూలై 15 నుంచి ప్రారంభించిన కొత్త బీటా ఇంటర్‌ఫేస్ ద్వారా స్లీపర్, ఏసీ తరగతుల సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై చూసే సౌలభ్యం ప్రయాణికులకు సులభంగా మారింది.

ఫేక్ ఏజెంట్లు, బాట్ ట్రాఫిక్‌పై ఉక్కుపాదం

టికెట్ బుకింగ్ ప్రక్రియలో అక్రమాలను అరికట్టడానికి ఐఆర్‌సీటీసీ కఠిన చర్యలు చేపట్టింది. యాంటీ-బాట్ సాంకేతికత ఉపయోగించడం వల్ల దళారులు వాడే బాట్ ట్రాఫిక్ 65 శాతం వరకు తగ్గిపోయింది. ఇప్పటివరకు దాదాపు 3.04 కోట్ల నకిలీ యూజర్ ఐడీలను శాశ్వతంగా బ్లాక్ చేశారు. మరొక 6.33 కోట్ల ఐడీలను పునఃపరిశీలన కోసం పంపారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 16 వేలకు పైగా సందేహాస్పద ఈమెయిల్ డొమైన్లను కూడా నిషేధించారు.

ఆధార్ నిర్ధారణ తప్పనిసరి

అధికారిక ఏజెంట్లు కూడా ఉదయం వేళల్లో అక్రమ బుకింగ్స్ చేయకుండా ఉండేందుకు ఉదయం 8:00 నుంచి 8:10 వరకు వారిని నిరోధించారు. నిబంధనల ప్రకారం ప్రారంభ విండోలో అడ్వాన్స్ టికెట్లు బుక్ చేయాలంటే వినియోగదారులు తమ ప్రభుత్వ గుర్తింపు కార్డులతో ప్రామాణీకరణ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులన్నీ సాధారణ ప్రయాణికులకు టికెట్లు వేగంగా లభించేలా తోడ్పడుతున్నాయి.

Next Story