Travel Insurance : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్!
45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్!

Travel Insurance : రైలు ప్రయాణం సురక్షితమైనదే అయినప్పటికీ, కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. అలాంటి సమయంలో ప్రయాణికులకు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండటానికి, ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన సదుపాయాన్ని కల్పిస్తోంది. కేవలం 45 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల వరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ (OTIS) కింద ఈ సదుపాయం లభిస్తుంది. కేవలం 45 పైసల ప్రీమియం చెల్లిస్తే, రైలు ప్రమాదాలలో రూ.10 లక్షల వరకు బీమా కవరేజ్ పొందవచ్చు. ఈ పథకం భారతీయ రైల్వే, కొన్ని బీమా కంపెనీల సహకారంతో నడుస్తోంది.
ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో కన్‌ఫర్మ్ లేదా ఆర్‌ఏసీ టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ ఇన్సురెన్స్ కు అర్హులు. రైల్వే కౌంటర్ల వద్ద టికెట్ కొనుగోలు చేసేవారికి, వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నవారికి ఈ సదుపాయం వర్తించదు. 5 సంవత్సరాల లోపు పిల్లలు, అంతర్జాతీయ వెబ్‌సైట్ల నుంచి టికెట్లు బుక్ చేసుకునే విదేశీ పర్యాటకులకు కూడా ఈ బీమా లభించదు.
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. టిక్ చేసిన వెంటనే టికెట్ ధరతో పాటు 45 పైసల ప్రీమియం జత అవుతుంది. టికెట్ బుక్ అయిన తర్వాత, బీమా కంపెనీ మీకు ఈమెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా పాలసీ వివరాలు, నామినీ వివరాలను అప్‌డేట్ చేసే లింక్‌ను పంపిస్తుంది. క్లెయిమ్ చేసుకోవాలంటే నామినీ వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.
బీమా తీసుకున్న లబ్ధిదారుడు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.10లక్షల నగదు లభిస్తుంది. ఒకవేళ శాశ్వత వైకల్యం కలిగితే రూ.10లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యం రూ.7.5 లక్షల వరకు, ఆస్పత్రి ఖర్చులకు రూ.2లక్షలు, మృతదేహం తరలింపునకు రూ.10,000 వరకు లభిస్తాయి. ఈ కవరేజ్ రైలు ప్రమాదాలు, పట్టాలు తప్పడం, ఢీకొనడం, ఉగ్రవాద దాడులు వంటి అనుకోని సంఘటనలన్నింటికీ వర్తిస్తుంది.
రైలు ప్రమాదం జరిగినప్పుడు, బీమాదారుడు లేదా నామినీ నేరుగా బీమా కంపెనీని సంప్రదించాలి. ఈ ప్రక్రియలో ఐఆర్‌సీటీసీ జోక్యం చేసుకోదు. క్లెయిమ్‌కు అవసరమైన అన్ని పత్రాల వివరాలు బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా ఎస్‌ఎంఎస్‌లో ఇచ్చిన లింక్‌లో లభిస్తాయి. ఈ పథకం తక్కువ ఖర్చుతో ప్రయాణికులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
