IRCTC: అక్టోబర్ 15 నుంచి కొత్త రూల్స్.. ట్రైన్ టికెట్ బుకింగ్స్ పై అదనపు ఛార్జీలు పడతాయా?
అదనపు ఛార్జీలు పడతాయా?

IRCTC: దేశంలో డిజిటల్ లావాదేవీల తీరుతెన్నులను మార్చేలా అక్టోబర్ 15 తేదీ నుంచి కొత్త యూపీఐ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే టికెట్ల బుకింగ్‌పై కూడా అదనపు ఛార్జీలు పడతాయనే ఊహాగానాలు ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తుండగా, ఎన్పీసీఐ దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. రోజూ వేలాది మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ యాప్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునేందుకు యూపీఐ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రూ.2000 పైబడిన కొన్ని లావాదేవీలపై ఎండీఆర్ వర్తిస్తుందనే ప్రకటన రావడంతో ప్రయాణికులలో గందరగోళం చెలరేగింది. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రైల్వే ప్రయాణికులు ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. టికెట్ ధర ఎంత ఉంటే కేవలం అంత మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఎలాంటి అదనపు భారం పడదు
కొత్త నిబంధనల ప్రకారం రూ.2000లకు మించిన రైల్వే లావాదేవీలపై రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది. అయితే ఈ రుసుమును ప్రయాణికులు లేదా వినియోగదారులు భరించాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జీని మర్చంట్ అనగా ఇండియన్ రైల్వే లేదా ఐఆర్సీటీసీ సంస్థే నేరుగా చెల్లిస్తుంది. కనుక ప్రయాణికుల జేబుపై రూపాయి కూడా అదనపు భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇతర ముఖ్యమైన సేవలు అలాగే వర్తించే విధానం
రైల్వే సేవలతో పాటు టెలికాం సేవలు, బీమా ప్రీమియం చెల్లింపులు అలాగే ఇంధన భర్తీ వంటి అత్యవసర రంగాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. సాధారణ వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం వరకు ఎండీఆర్ ఉండగా, ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రత్యేక రంగాలలో మాత్రం కేవలం రూ.5 స్థిరమైన రుసుమును నిర్ణయించారు. ఇది కూడా వినియోగదారుడికి ఎలాంటి సంబంధం లేకుండా సేవలు అందించే సంస్థలే భరిస్తాయి.
చిన్న మొత్తాల లావాదేవీలకు పూర్తి మినహాయింపు
సామాన్యులు చేసే చిన్నపాటి ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.2000 లోపు జరిగే చెల్లింపులను పూర్తిగా ఉచితంగా ఉంచింది. మీ రైలు టికెట్ విలువ రూ.2000 లోపు ఉంటే ఎలాంటి ఛార్జీలు వర్తించవు. కొత్త నిబంధనలన్నీ కేవలం డిజిటల్ పేమెంట్ వ్యవస్థ నిర్వహణ ఖర్చులను సర్దుబాటు చేసేందుకు ఉద్దేశించినవే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కావు.

