PPF : ఒకప్పుడు భారతదేశంలో పెట్టుబడి అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే మొదటి పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF). పన్ను ఆదా చేయడంతో పాటు మెరుగైన, సురక్షితమైన రిటర్న్స్ అందించడంలో ఈ స్కీమ్ ఎంతో కాలంగా నంబర్ వన్ ఛాయిస్ గా నిలిచింది. అయితే 2026 నాటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, మారుతున్న మార్కెట్ ట్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ల రాకతో పీపీఎఫ్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందా? అనే అనుమానాలు చాలా మందిలో మొదలయ్యాయి. కానీ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. ఇప్పటికీ రిస్క్ లేని పెట్టుబడులను కోరుకునే వారికి పీపీఎఫ్ ఒక అద్భుతమైన మార్గం.

పీపీఎఫ్ ప్రాధాన్యత ఎందుకు తగ్గింది?

గత కొన్నేళ్లుగా దేశంలో వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం పీపీఎఫ్ పై కూడా పడింది. గతంతో పోలిస్తే ఇప్పుడు పీపీఎఫ్ పై లభించే వడ్డీ రేటు కాస్త తగ్గింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం వల్ల పీపీఎఫ్ లో లభించే పన్ను మినహాయింపుల ఆకర్షణ కొంతమేర తగ్గింది. మరోవైపు నేటి తరం ఇన్వెస్టర్లు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పెట్టుబడి పెట్టడానికి పీపీఎఫ్ అనేది ఒకప్పుడు ఉన్నట్లుగా ఏకైక మార్గంగా మిగలలేదు.

ఇప్పటికీ పీపీఎఫ్ ఎందుకు స్పెషల్?

మార్కెట్లో ఎన్ని కొత్త స్కీమ్స్ వచ్చినా పీపీఎఫ్ కి ఉన్న ప్రత్యేకత వేరు. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ పూర్తి గ్యారెంటీ ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మీ పెట్టుబడికి, దానికి వచ్చే వడ్డీకి 100 శాతం భద్రత లభిస్తుంది. పైగా పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఇందులో EEE హోదా లభిస్తుంది. అంటే మీరు పెట్టే పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ, చివరగా మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం డబ్బుపై ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

బ్యాలెన్స్ పోర్ట్‌ఫోలియోకు ఇది చాలా ముఖ్యం

ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం, ఇప్పుడున్న రోజుల్లో మీ సంపాదన మొత్తాన్ని కేవలం పీపీఎఫ్ లోనే దాచడం కరెక్ట్ కాదు. అలాగే మొత్తం డబ్బును రిస్క్ ఎక్కువగా ఉండే షేర్ మార్కెట్ లో పెట్టడం కూడా సేఫ్ కాదు. అందుకే మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ గా ఉండాలంటే అందులో పీపీఎఫ్ ని ఒక భాగంగా చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ మీకు భారీ రిటర్న్స్ ఇస్తే, పీపీఎఫ్ మీ పెట్టుబడికి స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తుంది. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా పీపీఎఫ్ మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ప్రశ్నలు వేసుకోండి

ప్రస్తుతం పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది అసలు ప్రశ్నే కాదు. మీ నెలవారీ ఆదాయం ఎంత, మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి, మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు అనే విషయాల ఆధారంగా పీపీఎఫ్ లో ఎంత మొత్తం దాచాలనేది ముఖ్యం. మీ లక్ష్యం కేవలం ట్యాక్స్ సేవింగ్స్, ఎలాంటి రిస్క్ లేని లాంగ్ టర్మ్ ఫండ్ క్రియేట్ చేసుకోవడం అయితే పీపీఎఫ్ ఇప్పటికీ ఒక సూపర్ స్మార్ట్ ఛాయిస్. అలా కాకుండా ఎక్కువ రిటర్న్స్ కావాలనుకుంటే పీపీఎఫ్ తో పాటు కొద్దిగా ఈక్విటీ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story