TikTok : ఇండియాకు రీఎంట్రీ ఇస్తున్న టిక్‌టాక్ ? రీల్స్, షార్ట్స్‌కు ఇక పోటీ తప్పదా?
రీల్స్, షార్ట్స్‌కు ఇక పోటీ తప్పదా?

TikTok : సుమారు ఐదు సంవత్సరాల క్రితం భారతదేశంలో నిషేధించబడిన టిక్‌టాక్ తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. 2020 వరకు భారత మార్కెట్‌లో నంబర్ వన్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న చైనాకు చెందిన టిక్‌టాక్ వెబ్‌సైట్ ఇప్పుడు భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఓపెన్ అవుతోంది. అయితే, టిక్‌టాక్ యాప్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై ప్రభుత్వం కానీ, టిక్‌టాక్ సంస్థ కానీ అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.
టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా షార్ట్ వీడియోలకు ఒక మార్గదర్శి అని చెప్పొచ్చు. చైనాకు చెందిన బైట్‌డాన్స్ కంపెనీకి చెందిన టిక్‌టాక్ చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. 2020లో భారతదేశంలో కూడా దాదాపు 20 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు టిక్‌టాక్‌ను ఉపయోగించేవారు. అయితే, 2020లో గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేసిన సంఘటన తర్వాత, భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా అనేక చైనీస్ యాప్‌లను నిషేధించింది. ఈ ఐదేళ్లలో టిక్‌టాక్ స్థానంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటివి వచ్చాయి.
ప్రస్తుతం, కొంతమందికి టిక్‌టాక్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది. కానీ, అందులోని లింక్‌లు మాత్రం పనిచేయడం లేదని చాలామంది చెబుతున్నారు. టిక్‌టాక్‌పై నిషేధాన్ని అధికారికంగా తొలగించారా లేదా ఇది కేవలం ఒక సాంకేతిక సమస్యనా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అయితే, అమెరికా భారతదేశంపై 50% టారిఫ్‌లు విధించిన తర్వాత, భారత్, చైనా మధ్య సంబంధాలు కొంత సానుకూలంగా మారినట్లు కనిపిస్తోంది. భారత విదేశాంగ మంత్రి చైనాను సందర్శించారు. ఆగస్టు 31న ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు వెళ్లనున్నారు. చైనా కూడా తమ రేర్ ఎర్త్ మెటీరియల్స్ పై ఉన్న ఆంక్షలను తొలగించింది. ఈ పరిణామాలు భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా యాప్‌లపై నిషేధాన్ని ఎత్తివేస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.
