TikTok : భారత్‌కు టిక్‌టాక్ రీఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
.క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

TikTok : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక యూజర్ చేసిన పోస్టు ఇప్పుడు చర్చకు దారితీసింది. భారతదేశంలో టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను ప్రజలు యాక్సెస్ చేయగలుగుతున్నారని అతను పేర్కొన్నాడు. అయితే, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ ఈ యాప్ ఇప్పటికీ అందుబాటులో లేదు. దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కూడా స్పందించింది. భారతదేశంలో టిక్‌టాక్ సైట్ ఇప్పటికీ అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది. అయితే, ఈ యూజర్ చేసిన తప్పుడు దావాపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఎన్‌డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం.. దేశంలో టిక్‌టాక్ వెబ్‌సైట్ ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కూడా అందుబాటులో లేదని టెలికమ్యూనికేషన్స్ విభాగం తెలిపింది. ఈలోగా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ భారతదేశంలో ఈ ప్లాట్‌ఫామ్ అందుబాటుపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం దీనిపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. యూజర్లు ఈ తప్పుడు దావాపై సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఒక యూజర్ సరదాగా.. టిక్‌టాక్ వెబ్‌సైట్ 5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది, కానీ యాప్ ఇంకా అందుబాటులో లేదు. కంటెంట్ క్రియేటర్లకు చాలా సంతోషకర విషయం అని రాశారు. మరొక యూజర్.. గతంలో టిక్‌టాక్ భారతదేశంలో ఉన్నప్పుడు మన దగ్గర కేవలం ఫిల్టర్లు మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఏఐ యుగం వచ్చిందని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం, #TikTok అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది. ఇది ప్రజలకు ఈ యాప్ పట్ల ఎంత ఉత్సాహం ఉందో చూపిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం జూన్ 2020లో టిక్‌టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్ వంటి 59 యాప్‌లను దేశ భద్రతకు ముప్పుగా భావించి నిషేధించింది. వీటిలో ఎక్కువ భాగం చైనా యాప్‌లే. ఆ సంవత్సరంలోనే తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.
అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ యాప్‌లపై నిషేధం విధించే నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఈ నిషేధాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. చైనాపై భారతదేశం డిజిటల్ దాడి అని అభివర్ణించారు. విదేశీ సాంకేతిక సంస్థలపై భారత ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద చర్యలలో ఇది ఒకటి. అప్పటినుంచి టిక్‌టాక్ భారతదేశంలో అధికారికంగా నిషేధించింది.
