Mutual Funds : లాభాలకే కాదు.. నష్టాలకు కూడా చక్రవడ్డీ.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన కంపౌండింగ్ కాస్ట్ సీక్రెట్
కంపౌండింగ్ కాస్ట్ సీక్రెట్

Mutual Funds : షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మెజారిటీ ప్రజలకు కంపౌండింగ్ అపారమైన శక్తి గురించి బాగా తెలుసు. సమయం గడిచేకొద్దీ మనం పెట్టే పెట్టుబడిపై వచ్చే లాభాలు, ఆ తర్వాత ఆ లాభాలపై మరిన్ని లాభాలు వస్తూ మన సంపదను వేగంగా పెంచుతాయి. అయితే పెట్టుబడి ప్రపంచంలో దిగ్గజంగా పేరుగాంచిన, ఫాదర్ ఆఫ్ ఇండెక్సింగ్గా పిలవబడే జాన్ సి. బోగుల్ ఒక భిన్నమైన విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. కేవలం లాభాల కంపౌండింగ్‌ను అర్థం చేసుకుంటే సరిపోదని, పెట్టుబడులపై అయ్యే ఖర్చుల చక్రవడ్డీని అంటే కంపౌండింగ్ కాస్ట్‌ను కూడా ఇన్వెస్టర్లు ఖచ్చితంగా గమనించాలని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే మనం నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న ఖర్చులు దీర్ఘకాలంలో మన అసలు లాభాలను భారీగా తగ్గించేస్తాయి.
చిన్న ఖర్చులు.. కొండంత నష్టాలు..
మనం చేసే ప్రతి పెట్టుబడి వెనుకా ఏదో ఒక చిన్న ఖర్చు దాగి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణకు వసూలు చేసే ఎక్స్‌పెన్స్ రేషియో, బ్రోకరేజ్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్ ఫీజులు లేదా షేర్లను తరచూ కొనడం, అమ్మడం వల్ల అయ్యే ఖర్చులు ఇందులో భాగం. ప్రారంభంలో ఈ ఖర్చులు 0.5% లేదా 1% లాగా చాలా స్వల్పంగా కనిపిస్తాయి. కానీ, మన పెట్టుబడి 15 నుంచి 20 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగినప్పుడు, ఈ చిన్న ఖర్చులు కూడా చక్రవడ్డీ రూపంలో రూపాంతరం చెంది మన లాభాలపై పెద్ద దెబ్బ కొడతాయి. ఉదాహరణకు ఇద్దరు ఇన్వెస్టర్లకు మార్కెట్లో ఒకే రకమైన లాభాలు వచ్చినప్పటికీ, ఎక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న ఫండ్‌లో పెట్టిన వ్యక్తి సంపద, తక్కువ ఖర్చు ఉన్న ఫండ్‌లో పెట్టిన వ్యక్తి కంటే దీర్ఘకాలంలో చాలా తక్కువగా ఉంటుంది. దీన్నిబట్టి కేవలం ఎక్కువ రిటర్న్స్ రావడం మాత్రమే కాదు, తక్కువ ఖర్చు ఉండటం కూడా మంచి పెట్టుబడికి అత్యంత అవసరమని స్పష్టమవుతోంది.
లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ వైపు మొగ్గు చూపడం ఎందుకు బెటర్?
జాన్ బోగుల్ తన జీవితకాలంలో ఎల్లప్పుడూ తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఇన్వెస్టర్లకు గట్టిగా సలహా ఇచ్చేవారు. ఇన్వెస్టర్లు మార్కెట్ సహజమైన రిటర్న్స్‌ను అందుకోవడానికి ప్రయత్నించాలి కానీ, ఫండ్ మేనేజర్ల ఫీజుల పేరిట అనవసరమైన అదనపు ఖర్చులను భరించకూడదని ఆయన నమ్మేవారు. తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉండే ఫండ్స్‌ను ఎంచుకోవడం వల్ల మీ సంపాదనలో సింహభాగం మీ ఖాతాలోనే మిగిలిపోతుంది. దీర్ఘకాలంలో ఈ చిన్న వ్యత్యాసమే మీ అకౌంట్‌లో లక్షల రూపాయల అదనపు లాభంగా మారుతుంది. ఆయన ప్రతిపాదించిన ఈ సూత్రం నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఒక బైబిల్ లాంటి నియామకంగా పనిచేస్తోంది.
పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం రిటర్న్స్ చూస్తే సరిపోదు
ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం సదరు ఫండ్ గతంలో ఎంత లాభాన్ని ఇచ్చిందనే ట్రాక్ రికార్డ్ మాత్రమే చూసి మోసపోకూడదు. ఆ లాభాల వెనుక మన నుంచి ఎంత మేర మేనేజ్మెంట్ ఛార్జీలను వసూలు చేస్తున్నారనే లాజిక్‌ను కూడా గమనించాలి. ఇందుకోసం ఇన్వెస్టర్లు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది:
* వీలైనంత వరకు తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లేదా డైరెక్ట్ ప్లాన్స్ ఎంచుకోవాలి.
* మార్కెట్ హెచ్చుతగ్గులను చూసి భయపడి, అవసరం లేకుండా తరచూ షేర్లను కొనడం, అమ్మడం చేయకూడదు.
* మీ ఆర్థిక లక్ష్యాల కోసం సుదీర్ఘ కాలం పాటు పెట్టుబడిని మార్చకుండా కొనసాగించాలి.
* బ్రోకరేజ్ సంస్థలు వసూలు చేసే హిడెన్ ఛార్జీలు పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి.
* మీ పోర్ట్‌ఫోలియోను క్రమ పద్ధతిలో రివ్యూ చేయాలి, కానీ అనవసరంగా ఫండ్స్ మార్చేస్తూ ఉండకూడదు.
* లాభాల్లో మీ చేతికి వచ్చేది ఎంత? అనవసరపు బ్రోకరేజ్, హిడెన్ ఛార్జీలకు అడ్డుకట్ట వేసే స్మార్ట్ టిప్స్
జాన్ బోగుల్ మనకు నేర్పిన అత్యంత విలువైన పాఠం ఒక్కటే.. పెట్టుబడి ప్రపంచంలో మీ డబ్బు ఎంత పెరిగింది అనేది మాత్రమే ముఖ్యం కాదు, అన్ని రకాల ఖర్చులు మరియు ట్యాక్సులు పోగా చివరకు మీ చేతిలో ఎంత మిగిలింది అనేది అత్యంత కీలకం. మీరు పెట్టుబడి ఖర్చులను ఎంత తక్కువగా ఉంచుకుంటే, చక్రవడ్డీ పూర్తి స్థాయి ప్రయోజనాన్ని అంత ఎక్కువగా మీ సొంతం చేసుకోగలరు. కాబట్టి విజయవంతమైన ఇన్వెస్టర్ కావాలంటే కేవలం ఎక్కువ లాభాల వెంట పరుగులు పెట్టడం మాత్రమే కాదు, అనవసరమైన పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం కూడా ఒక అద్భుతమైన వ్యూహం. ఈ సింపుల్ స్ట్రాటజీని పాటిస్తేనే దీర్ఘకాలంలో మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు.

