ఇలా వెంటనే చెక్ చేసుకోండి

EPFO : పీఎఫ్ అకౌంట్ అనేది ఉద్యోగులకు ఆర్థిక భద్రతను ఇచ్చే ఒక ముఖ్యమైన పొదుపు పథకం. ప్రభుత్వం ఏటా ఈ అకౌంట్‌పై వడ్డీని ప్రకటిస్తుంది. కానీ, మీ అకౌంట్ ఇనాక్టివ్‎లో ఉంటే మీకు వడ్డీ రాదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఇనాక్టివ్‌గా ఉంటే ఏం చేయాలి? అనే విషయాలను EPFO చెప్పిన వివరాల ప్రకారం తెలుసుకుందాం.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తాజాగా ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం 8.25% వార్షిక వడ్డీ రేటును ప్రకటించింది. ఈ వడ్డీ ప్రతి నెలా మీ అకౌంట్‌లో జమ అయ్యి, ఏటా ఒకసారి మీ పీఎఫ్ అకౌంట్‌లో చేరుతుంది. అయితే, మీ పీఎఫ్ అకౌంట్ గత 36 నెలలుగా (మూడేళ్ళు) ఇనాక్టివ్‎లోఉంటే, ఆ అకౌంట్‌పై వడ్డీ రావడం ఆగిపోతుందని EPFO ఆగస్టు 27, 2025న ఒక ప్రకటనలో స్పష్టంగా తెలిపింది.

ఒక పీఎఫ్ ఖాతాలో మూడు సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు (డబ్బు జమ చేయడం లేదా విత్ డ్రా చేయడం) జరగకపోతే, ఆ ఖాతాను ఇనాక్టివ్ అకౌంటుగా పరిగణిస్తారు. మీరు ఒక కంపెనీలో ఉద్యోగం మానేసినా, కొత్త అకౌంట్‌లోకి బదిలీ చేయకపోయినా, ఈ సమస్య ఎదురవుతుంది.

సాధారణంగా, ఒక ఉద్యోగి 55 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయిన తర్వాత కూడా, అతని పీఎఫ్ అకౌంట్ 58 సంవత్సరాల వయస్సు వరకు వడ్డీని పొందుతుంది. ఆ తర్వాత అది డియాక్టివేట్గా మారుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మారినట్లయితే, మీ పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త అకౌంట్‌లోకి వెంటనే బదిలీ చేసుకోవాలి. దీనివల్ల మీ డబ్బుపై నిరంతరం వడ్డీ వస్తుంది. ప్రస్తుతం ఏ కంపెనీలోనూ పనిచేయని వారు, తమ పీఎఫ్ డబ్బును వెంటనే విత్ డ్రా చేసుకోవడం మంచిది. లేకపోతే అకౌంట్ ఇనాక్టివ్ గా మారి, వడ్డీ నష్టపోతారు.

పీఎఫ్ అకౌంట్‌ను ఎలా యాక్టివ్‌గా ఉంచుకోవాలి?

EPFO తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లో ఒక కీలకమైన సలహా ఇచ్చింది. పీఎఫ్ సభ్యులు తమ పాత అకౌంట్లలో డబ్బు ఉంటే, వాటిని కొత్త అకౌంట్‌లకు వెంటనే బదిలీ చేసుకోవాలని సూచించింది. దీనివల్ల వడ్డీ నష్టాన్ని నివారించవచ్చు. అలాగే, ఉద్యోగం మానేసిన వారు తమ పీఎఫ్ డబ్బును సకాలంలో విత్ డ్రా చేసుకోవాలి.

త్వరలో రానున్న EPFO 3.0

EPFO తమ సేవలను మరింత మెరుగుపరచడానికి EPFO 3.0 అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా క్లెయిమ్ ప్రాసెసింగ్ మరింత వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా, యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకునేలా కొత్త సేవలను అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను సెలక్ట్ చేశారు. ఈ కొత్త వేదిక ద్వారా పీఎఫ్ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story