Gaming Scam: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అలవాటున్న భారతీయుల జేబుల్లో నుంచి డబ్బులు చడీచప్పుడు లేకుండా విదేశాలకు ఎలా తరలిపోతున్నాయో ఆదాయపు పన్ను శాఖ తాజా దాడుల్లో బయటపడింది. అక్టోబర్ మూడో వారంలో ఐటీ అధికారులు జరిపిన భారీ ఆపరేషన్‌లో చైనాతో సంబంధాలున్న ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల రూ.2,700 కోట్ల అక్రమ పేమెంట్ నెట్‌వర్క్ ధ్వంసమైంది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ సోదాల్లో రూ.6.2 కోట్ల విలువైన అక్రమ క్రిప్టోకరెన్సీని జప్తు చేశారు. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీ ద్వారా సుమారు రూ.10 కోట్లు చెల్లించి దుబాయ్‌లో కొనుగోలు చేసిన రెండు రహస్య ఫ్లాట్లను కూడా గుర్తించారు. డబ్బు విదేశాలకు వెళ్లిన మార్గాన్ని ట్రేస్ చేసిన అధికారులు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకున్నారు.

1stPe నకిలీ డిజిటల్ ఆర్ట్ పేరుతో దోపిడీ

ఈ మొత్తం స్కామ్‌కు కేంద్ర బిందువు 1stPe అనే నకిలీ డిజిటల్ ఆర్ట్ ప్లాట్‌ఫామ్. దీని సర్వర్ డేటాను పరిశీలించగా దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. జులై 2023 నుంచి అక్టోబర్ 2026 వరకు అంటే వరుసగా 40 నెలల పాటు ఈ ప్లాట్‌ఫామ్ చైనా గేమింగ్ యాప్స్ తరఫున సుమారు రూ.2,700 కోట్లు వసూలు చేసింది. ఇందుకు గాను కమీషన్ రూపంలో ఏకంగా రూ.170 కోట్లు వెనకేసుకుంది. చైనా గేమింగ్ కంపెనీలు భారతీయ ఆటగాళ్ల నుంచి నేరుగా యూపీఐ ద్వారా డబ్బు తీసుకోలేవు. దీన్ని అధిగమించేందుకు 1stPe ప్రమోటర్లు అనేక షెల్ (కాగితపు) కంపెనీలను సృష్టించి, డిజిటల్ ఆర్ట్ అమ్మే నకిలీ వెబ్‌సైట్లను తయారు చేసి మర్చెంట్ ఐడీలు తీసుకున్నారు.

గేమింగ్ డబ్బును డిజిటల్ ఆర్ట్ సేల్‌గా మార్చిన గ్యాంగ్

భారతీయ ఆటగాడు గేమింగ్ యాప్‌లో యూపీఐ ద్వారా డబ్బు వేయగానే, ఆ రిక్వెస్ట్ ముందుగా 1stPe వద్దకు వెళ్లేది. అక్కడి నుంచి షెల్ కంపెనీ మర్చెంట్ ఐడీ ద్వారా పేమెంట్ గేట్‌వేకు చేరేది. పేమెంట్ గేట్‌వే ఎయిర్‌పే ఆ లావాదేవీని డిజిటల్ ఆర్ట్ సేల్ గా భావించి, ఆ డబ్బును షెల్ కంపెనీ బ్యాంక్ ఖాతాలో జమ చేసేది. ప్రతి లావాదేవీలో 1stPe తన కమీషన్ కట్ చేసుకునేది. నిజానికి ఈ కంపెనీలకు డిజిటల్ ఆర్ట్‌తో ఎలాంటి సంబంధం లేదని, కేవలం గేమింగ్ డబ్బులు దారి మళ్లించేందుకే ఇవి పనిచేశాయని ఐటీ దర్యాప్తులో తేలింది.

ఖాతా ఫ్రీజ్ అయితే క్షణాల్లో కొత్త షెల్ కంపెనీ రెడీ

బ్యాంకులు లేదా దర్యాప్తు సంస్థలకు అనుమానం రాకుండా ఉండేందుకు వీరు పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. వసూలైన డబ్బునంతా ఒకే ఖాతాలో వేయకుండా అనేక కంపెనీల ఖాతాల్లోకి విభజించారు. ఒకవేళ ఏదైనా బ్యాంక్ అనుమానంతో ఒక కంపెనీ ఖాతాను ఫ్రీజ్ చేస్తే, వెంటనే పేమెంట్ ట్రాఫిక్ మొత్తాన్ని మరో షెల్ కంపెనీకి మళ్లించేవారు. పని ఎక్కడా ఆగిపోకుండా ఉండేందుకు నామమాత్రపు (నామినీ) డైరెక్టర్లను పెట్టుకుని, వర్చువల్ ఆఫీసులతో ఎప్పటికప్పుడు కొత్త డమ్మీ వెబ్‌సైట్లు, కొత్త మర్చెంట్ ఐడీలు సిద్ధం చేసుకునేవారు.

113 యాప్‌ల డేటా.. 'హోప్' పేరుతో మాస్టర్ కనెక్షన్

1stPe సర్వర్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులకు చైనా గేమింగ్ యాప్‌లతో లింక్ ఉన్న 113 క్లయింట్ లాగిన్లు దొరికాయి. వీటిలో కుమార్‌పే, బడ్డీపే, రమ్మీపెప్పర్, బ్లూబెర్రీ రమ్మీ, జూమ్‌నక్కీ, డీప్ రమ్మీ, Xxv918 లాంటి పాపులర్ పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా కుమార్‌పే, Xxv918, రమ్మీపెప్పర్ అన్నీ హోప్ అనే ఒకే కామన్ పేరెంట్ లాగిన్ కింద నడుస్తున్నట్లు తేలింది. వీటితో పాటు కింగ్‌గేమ్ రమ్మీ, వైల్డ్‌బేర్ రమ్మీ, విస్టన్ గేమ్, లక్కీస్టార్, 1విన్ లాంటి బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా భారతీయుల డబ్బు ఈ అక్రమ నెట్‌వర్క్‌లోకి ప్రవహించినట్లు ఐటీ శాఖ గుర్తించింది.

Next Story