విదేశీ ఆస్తుల లెక్క తేల్చమంటూ నోటీసులు

Tax Alert : దేశంలోని బడా వ్యాపారవేత్తలకు ఆదాయపు పన్ను శాఖ గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. విదేశాల్లో ఆస్తులు ఉన్నా, అక్కడి నుంచి భారీగా ఆదాయం వస్తున్నా.. తమ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్‌లో ఆ వివరాలను దాచిపెట్టిన కుబేరుల జాబితాను ఐటీ శాఖ సిద్ధం చేసింది. ముఖ్యంగా అహ్మదాబాద్, సూరత్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని ప్రముఖ వ్యాపార కుటుంబాలు ఇప్పుడు ఐటీ శాఖ రాడార్‌లో ఉన్నాయి. వీరందరికీ త్వరలోనే నోటీసులు పంపేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

భారతీయ వ్యాపారవేత్తలకు విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలు, అక్కడ కొనుగోలు చేసిన ఆస్తుల సమాచారం మన ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని చాలామందికి సందేహం రావచ్చు. దీనికోసం అంతర్జాతీయ స్థాయిలో ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే ఒక వ్యవస్థ ఉంది. దీని ద్వారా వివిధ దేశాల ప్రభుత్వాలు పరస్పరం తమ వద్ద ఉన్న విదేశీయుల ఆర్థిక లావాదేవీల డేటాను పంచుకుంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సర విశ్లేషణలో వేల కోట్ల రూపాయల విదేశీ ఆస్తులను ఐటీ రిటర్న్స్‌లో చూపలేదని అధికారులు గుర్తించారు.

గతేడాది ఐటీ శాఖ నడ్జ్ పేరుతో ఒక ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. విదేశీ ఆస్తులను వెల్లడించని వారికి ఒక చిన్న హెచ్చరిక లాంటి సమాచారం పంపి, వారే స్వచ్ఛందంగా వివరాలు ఇచ్చేలా ప్రోత్సహించింది. దీనివల్ల వేల మంది తమ తప్పులను సరిదిద్దుకుని పన్నులు చెల్లించారు. ఇప్పుడు దీని తర్వాతి దశను అధికారులు మొదలుపెట్టబోతున్నారు. ఈసారి పంపే నోటీసుల్లో నేరుగా ఆస్తి వివరాలు చెప్పకపోయినా.. మీ ఐటీ రిటర్న్స్‌ను ఒకసారి మళ్ళీ సరిచూసుకోండి అని హెచ్చరిస్తూ, పన్ను కట్టేందుకు అవకాశం ఇస్తారు.

ఒకవేళ ఐటీ శాఖ నోటీసులు పంపిన తర్వాత కూడా సరైన వివరాలు ఇవ్వకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని దాచిపెట్టినట్లు తేలితే.. ఆ ఆస్తి విలువపై ఏకంగా 30 శాతం పన్ను విధిస్తారు. అంతేకాకుండా ఆ పన్ను మొత్తానికి మూడు రెట్ల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. నల్లధనం నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో చిన్న ట్యాక్స్ పేయర్లు, విద్యార్థుల కోసం ఒక రాయితీ పథకాన్ని ప్రకటించినప్పటికీ, కోట్లకు కోట్లు వెనకేసిన పెద్ద వ్యాపార కుటుంబాలకు ఆ ఊరట లభించదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story