Income Tax: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తెలిసీ తెలియక జరిగే క్లరికల్ పొరపాట్లను అక్రమ రాబడిగా భావించి నోటీసులు పంపే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు ఐటీఏటీ ముంబై గట్టి షాకిచ్చింది. రాబడి లేని సొమ్ముపై పన్ను విధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ఒక వేతనజీవికి ఊహించని పెద్ద ఊరటనిచ్చింది. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఫారమ్‌లో పొరపాటున తప్పుడు వివరాలు నమోదు చేయడం సాధారణంగా జరిగే పడే ప్రక్రియే. ఈ పొరపాటు ఆధారంగా పన్ను పెంచే అధికారం అధికారులకు లేదని ముంబై ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. గుజరాత్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ప్లాంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మిస్టర్ గోలే 2022 జూలైలో తన ఐటీఆర్ దాఖలు చేశారు. ఆయన వార్షిక జీతం రూ.28.25 లక్షలుగా పేర్కొన్నారు. ఐటీఆర్ ఫైలింగ్ చేసిన వ్యక్తి చేసిన డేటా ఎంట్రీ పొరపాటు వల్ల సెక్షన్ 10(11) కింద రూ.9.6 లక్షల ఈపీఎఫ్ సొమ్మును పన్ను మినహాయింపు ఉన్న ఆదాయంగా చూపించారు. దాంతో ఈ సొమ్ముకు తగిన ఆధారాలు చూపలేకపోయారని అసెసింగ్ ఆఫీసర్ ఏకంగా రూ.9.6 లక్షల మొత్తాన్ని పన్ను పరిధిలోకి చేర్చి నోటీసు ఇచ్చారు.

అసలు తీయని సొమ్ముపై పన్ను విధింపు

బాధితుడు ప్రైవేట్ ఉద్యోగి కావడం వల్ల ఆయన ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వస్తారు. ఆయన తన పీఎఫ్ ఖాతా నుంచి ఎలాంటి సొమ్మును విత్‌డ్రా చేయలేదు. ఎలాంటి వడ్డీ ఆదాయం పొందలేదు. కేవలం ఫారమ్ నింపేటప్పుడు చేసిన మానవీయ తప్పిదం ఆధారంగా ఐటీ శాఖ అధికారులు రూ.9.6 లక్షల అదనపు పన్ను విధించడంతోపాటు కమీషనర్ ఆఫ్ అప్పీల్స్ కూడా ఆ పన్ను పెంపును సమర్థించారు. దీంతో బాధితుడు చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ముంబై ఐటీఏటీని ఆశ్రయించారు.

కోర్టులో బలమైన ఆధారాలు

ట్రైబ్యునల్ విచారణలో బాధితుడి తరఫున బలమైన ఆధారాలు సమర్పించారు. ఫారమ్ 16, ఫారమ్ 26ఏఎస్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, పీఎఫ్ ఖాతా వివరాలు సమర్పించి ఏ ఒక్క రూపాయి విత్‌డ్రా చేయలేదని నిరూపించారు. అలాగే ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ ఈ వివరాలు కేవలం డేటా ఎంట్రీలో జరిగిన పొరపాటని స్పష్టం చేశారు. ఐటీఆర్ నింపే సమయంలో జరిగిన ఈ తప్పు వల్ల తనకు ఎలాంటి పన్ను లబ్ధి చేకూరలేదని వివరించారు. మరోవైపు ఈ సొమ్ము బాధితుడి ఖాతాలోకి జమ అయినట్లు ఎలాంటి ఆధారాలనూ ఐటీ శాఖ చూపలేకపోయింది.

న్యాయస్థానం క్లారిటీ

కేసును నిశితంగా పరిశీలించిన ముంబై ఐటీఏటీ పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. ఐటీఆర్‌లో తప్పుగా సమాచారం నమోదు చేసినంత మాత్రాన దానిని విక్రయించిన లేదా పొందిన ఆదాయంగా భావించలేమని తేల్చిచెప్పింది. బాధితుడు తన వైపు నుంచి సరైన ఆధారాలు చూపి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత, విరుద్ధమైన ఆధారాలు చూపే బాధ్యత ఐటీ శాఖపైనే ఉంటుందని వ్యాఖ్యానించింది. ఎటువంటి నిరూపణ లేకుండా కేవలం ఊహాగానాలతో పన్ను విధించడం చెల్లదని తీర్పు చెబుతూ అధికారి విధించిన రూ.9.60 లక్షల అదనపు పన్ను డిమాండ్‌ను పూర్తిగా రద్దు చేసింది.

Next Story