Income Tax: సమయానికి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదని పన్ను శాఖ నిలిపివేసిన రూ.5.31 లక్షల రిఫండ్‌పై ఆదాయపు పన్ను అపీలేట్ ట్రిబ్యునల్ (ITAT) చారిత్రాత్మక తీర్పునిచ్చింది. చట్టబద్ధత లేకుండా పన్నును ఉంచుకోలేరని స్పష్టం చేస్తూ ట్యాక్స్ పేయర్‌కు వడ్డీతో కలిపి సొమ్మును చెల్లించాలని ఆదేశించింది. పన్ను చెల్లింపుదారులకు ఇది నిజంగా పెద్ద ఊరట. ఢిల్లీకి చెందిన ఒక పన్ను చెల్లింపుదారుడు అసెస్మెంట్ ఇయర్ 2019-20కి సంబంధించి సరైన సమయానికి ఐటీఆర్ దాఖలు చేయలేదు. పన్ను శాఖ ఇన్‌సైట్ పోర్టల్ అతనికి సంబంధించిన భారీ లావాదేవీలను గుర్తించడంతో రీ-అసెస్మెంట్ ప్రక్రియ ప్రారంభించి సెక్షన్ 148 కింద నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు స్పందిస్తూ పన్ను చెల్లింపుదారుడు ఐటీఆర్ దాఖలు చేశాడు. వ్యాపారంలో రూ. 1.38 కోట్ల నష్టం రావడం వల్ల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం సున్నాగా చూపించాడు. సదరు ఆర్థిక సంవత్సరంలో కట్ అయిన రూ. 5,31,680 టీడీఎస్ మొత్తాన్ని రిఫండ్ చేయాలని కోరాడు. అసెసింగ్ ఆఫీసర్ ఆదాయాన్ని సున్నాగా అంగీకరించినప్పటికీ, ఒరిజినల్ రిటర్న్ నిర్ణీత గడువులోగా వేయనందున రిఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని తిరస్కరించాడు.

రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావించిన ఐటీఏటీ

పన్ను శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధితుడు ఢిల్లీ ఐటీఏటీని ఆశ్రయించాడు. ఈ కేసును సమగ్రంగా విచారించిన ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 237 ప్రకారం, చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ సొమ్ము జమ అయితే ఆ వ్యత్యాసాన్ని కచ్చితంగా రిఫండ్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 265 ప్రకారం చట్టబద్ధమైన అధికారం లేకుండా ప్రభుత్వం ఏ పన్నునూ వసూలు చేయడానికి వీల్లేదని గుర్తుచేసింది. రీ-అసెస్మెంట్ తర్వాత చెల్లించాల్సిన పన్ను సున్నా అయినప్పుడు, మిగులు టీడీఎస్ మొత్తాన్ని పన్ను శాఖ తన వద్దే ఉంచుకోవడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. బాధితుడికి రూ.5,31,680 ని చట్టబద్ధమైన వడ్డీతో కలిపి తక్షణమే చెల్లించాలని ఆదేశించింది.

ఆలస్యమైన రిఫండ్ దాఖలుపై నిపుణుల సూచనలు

ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ తీర్పు పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం అందించినప్పటికీ, ఐటీఆర్ ఎల్లప్పుడూ సమయానికే ఫైల్ చేయడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఒరిజినల్ లేదా బిలేటెడ్ రిటర్న్ వేయడం మర్చిపోతే, సెక్షన్ 119(2)(b) కింద ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ కమీషనర్‌కు విన్నవించుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖే స్వయంగా రీ-అసెస్మెంట్ చేపట్టిన సందర్భాల్లో కొత్తగా దాఖలు చేసే ఐటీఆర్‌లో రిఫండ్ కోరవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రిఫండ్ తిరస్కరణకు గురైతే ఏం చేయాలి?

ఐటీ శాఖ నుంచి రిఫండ్ తిరస్కరణకు గురైతే ఆందోళన చెందకుండా చట్టపరమైన మార్గాలను ఎంచుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. గడువు ముగిసిన పరిస్థితుల్లో ఆలస్య మన్నింపు అభ్యర్థనను పెట్టుకోవచ్చు. ఒకవేళ రిటర్న్ ప్రాసెసింగ్‌లో సాంకేతిక లోపాల వల్ల డబ్బులు రాకపోతే రెక్టిఫికేషన్ దాఖలు చేయవచ్చు. రీ-అసెస్మెంట్ సమయంలో సరైన కారణాలతో రిఫండ్ కోరినా అధికారులు నిరాకరిస్తే, ట్రిబ్యునల్ స్థాయిలో అప్పీలుకు వెళ్లడమే సరైన చట్టపరమైన మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story