ఒక్క దెబ్బకు రూ.11,500 కోట్లు గోవిందా

LIC : కొత్త ఏడాది 2026 ప్రారంభం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా ప్రభుత్వ భీమా దిగ్గజం ఎల్‌ఐసీకి ఒక పీడకలలా మారింది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేర్లను అతలాకుతలం చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఐటీసీ షేర్లు కుప్పకూలడంతో ఎల్‌ఐసీ ఆస్తి విలువ ఏకంగా వేల కోట్లు ఆవిరైపోయింది. సామాన్య ఇన్వెస్టర్లతో పాటు ప్రభుత్వ సంస్థల జేబులకు భారీ చిల్లు పడింది.

2026 ఏడాది మొదటి రెండు రోజులే ఐటీసీకి చుక్కలు చూపించాయి. సిగరెట్లపై పన్ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే ఇన్వెస్టర్లు భయంతో అమ్మకాలకు దిగారు. దీంతో ఐటీసీ షేరు విలువ ఏకంగా 14 శాతానికి పైగా పడిపోయింది. జనవరి 2వ తేదీ నాటికి షేరు ధర రూ.345.25 స్థాయికి పడిపోయి, గత 52 వారాల కనిష్టానికి చేరుకుంది. ఐటీసీలో ప్రత్యేకంగా ప్రమోటర్లు ఎవరూ లేకపోవడంతో, పబ్లిక్ షేర్ హోల్డర్లు, పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లపై ఈ ప్రభావం నేరుగా పడింది. కేవలం రెండు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ విలువ రూ.72,000 కోట్లు తగ్గిపోయింది.

ఐటీసీలో ఎల్‌ఐసీకి అతిపెద్ద వాటా (15.86 శాతం) ఉంది. డిసెంబర్ 31, 2025 నాటికి ఐటీసీలో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.80,028 కోట్లుగా ఉండేది. కానీ షేర్లు కుప్పకూలడంతో కేవలం రెండు రోజుల్లోనే ఆ విలువ రూ.68,560 కోట్లకు పడిపోయింది. అంటే ఎల్‌ఐసీకి కాగితంపై జరిగిన నష్టం ఏకంగా రూ.11,468 కోట్లు. కేవలం ఎల్‌ఐసీ మాత్రమే కాదు, ఇతర ప్రభుత్వ భీమా సంస్థలైన జీఐసీ, న్యూ ఇండియా అస్యూరెన్స్ కూడా కలిపి మొత్తం రూ.13,740 కోట్ల మేర నష్టపోయాయి. ఇది ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.

ఇన్వెస్టర్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఇది నోషనల్ లాస్ అంటే ప్రస్తుతం మార్కెట్ ధర తగ్గడం వల్ల కనిపిస్తున్న నష్టం మాత్రమే. ఎల్‌ఐసీ తన దగ్గరున్న షేర్లను ఇప్పుడు అమ్మేస్తేనే ఆ నష్టం నిజమైన నష్టంగా మారుతుంది. భీమా సంస్థలు సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతాయి కాబట్టి, భవిష్యత్తులో షేరు ధర మళ్ళీ పెరిగితే ఈ నష్టం పూడిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి ఇది కాగితాలకే పరిమితమైన నష్టంగా పరిగణించాలి.

జనవరి 2 సాయంత్రం నాటికి ఐటీసీ షేరు కొద్దిగా కోలుకుని రూ.350 వద్ద స్థిరపడింది. మరోవైపు ఐటీసీ షేరు పడిపోయినప్పటికీ, ఎల్‌ఐసీ సొంత షేరు మాత్రం 1 శాతం పెరిగి రూ.861 వద్ద ముగియడం విశేషం. సిగరెట్లపై పన్ను పెంపు అనేది కంపెనీ లాభాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది తదుపరి త్రైమాసిక ఫలితాల్లో తేలనుంది. అప్పటివరకు ఐటీసీ షేర్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా వేచి చూడటం మంచిదని సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story