ITR Filing : ట్యాక్స్ రూపంలో కట్ అయిన డబ్బు మొత్తం తిరిగి కావాలా? అయితే ఈ పనులు చేయండి
అయితే ఈ పనులు చేయండి

ITR Filing : ఐటీఆర్ ఫైలింగ్ దాఖలు చేసే కీలకమైన సమయం వచ్చేసింది. పన్ను చెల్లింపుదారులు అందరి మదిలోనూ ఇప్పుడు ఒకటే ఆలోచన మెదులుతోంది.. తాము కట్టిన పన్నును రీఫండ్ రూపంలో వీలైనంత ఎక్కువగా ఎలా తిరిగి పొందాలి? అయితే, రీఫండ్ పెంచుకోవడం అనేది కేవలం ఆఖరి నిమిషంలో పెట్టుబడి పత్రాలను వెతకడం వల్ల సాధ్యం కాదు. మీ అసలు ఆదాయం, సరైన పెట్టుబడి ప్రణాళికలు, ఏడాది పొడవునా కట్ అయిన ట్యాక్స్ వివరాలను ఐటీఆర్ ఫామ్‌లో అత్యంత ఖచ్చితంగా నమోదు చేసినప్పుడే పూర్తి రీఫండ్ సాధ్యమవుతుంది. అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తాము చెల్లించిన టీడీఎస్ లేదా అడ్వాన్స్ ట్యాక్స్ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలోనే వదిలేస్తుంటారు. మీ అసలు పన్ను బాధ్యత కంటే ఎక్కువ ట్యాక్స్ కట్ అయినప్పుడు, ఆ అదనపు మొత్తాన్ని ఐటీఆర్ ద్వారా క్లెయిమ్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నేరుగా మీ ఖాతాకు బదిలీ చేస్తుంది.
రిటర్న్స్ ఫైల్ చేయడానికి ముందు ప్రతి ట్యాక్స్ పేయర్ చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం మధ్య ఉన్న వ్యత్యాసాలను పోల్చి చూసుకోవడం. మీ ఆఫీస్‌లో సహోద్యోగికి కొత్త విధానం ఉపయోగపడిందని, అది మీకు కూడా లాభసాటిగా ఉంటుందని అనుకోవడం పొరపాటు. మీ ఆదాయం, మినహాయింపులను బట్టి ఏ విధానంలో పన్ను తక్కువగా పడుతుందో లెక్కించుకోవాలి. ఒకవేళ మీ జీతం నుంచి ఏడాది కాలంలో ఎక్కువ టీడీఎస్ కట్ అయి ఉంటే, మీకు సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకోవడం ద్వారా ఆ ఫంసావు అయిన డబ్బును సులభంగా రీఫండ్ రూపంలో వెనక్కి రాబట్టుకోవచ్చు.
మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే, ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేయడానికి బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సెక్షన్ 80C కింద పీపీఎఫ్, ఈపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా 5 ఏళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా నేరుగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి అదనంగా, సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం ద్వారా వయసును బట్టి రూ.25,000 నుంచి రూ.50,000 వరకు అదనపు బెనిఫిట్ లభిస్తుంది. అలాగే HRA క్లెయిమ్ చేసుకోవడంతో పాటు, సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులపై ఏకంగా రూ. 2 లక్షల వరకు భారీ ట్యాక్స్ మినహాయింపును సొంతం చేసుకోవచ్చు.
సెక్షన్ 80C పరిమితి అయిన రూ.1.5 లక్షలు దాటిన తర్వాత కూడా ట్యాక్స్ ఆదా చేయాలనుకునే వారికి NPS ఒక అద్భుతమైన మార్గం. సెక్షన్ 80CCD(1B) కింద ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులు మరో రూ.50,000 అదనపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇందులో మరో విశేషం ఏంటంటే, సెక్షన్ 80CCD(2) కింద మీ యాజమాన్యం అందించే సహకారానికి లభించే పన్ను ప్రయోజనం పాత, కొత్త.. రెండు పన్ను విధానాల్లోనూ వర్తిస్తుంది. దీని ద్వారా పాత విధానంలో బేసిక్ శాలరీలో 10 శాతం, కొత్త విధానంలో 14 శాతం వరకు కాంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్ మినహాయింపు దక్కుతుంది.
జీతం తీసుకునే ప్రతి ఉద్యోగికి ఎటువంటి పెట్టుబడి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండానే స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం అందుతుంది. పాత పన్ను విధానంలో ఈ మినహాయింపు రూ.50,000 గా ఉండగా, కొత్త పన్ను విధానంలో దీనిని రూ.75,000కు పెంచారు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారికి సెక్షన్ 57(iia) కింద పాత విధానంలో రూ.15,000, కొత్త విధానంలో రూ.25,000 వరకు మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ మీ మొత్తం ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి లోపు ఉంటే, సెక్షన్ 87A కింద లభించే రిబేట్ ద్వారా మీ పన్ను బాధ్యత పూర్తిగా శూన్యం (జీరో) అవుతుంది.
మీ ట్యాక్స్ రీఫండ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా మీ బ్యాంకు ఖాతాలో పడాలంటే కొన్ని ప్రాథమిక విషయాలను అస్సలు మర్చిపోవద్దు. మీ ఆదాయ వనరులకు తగినట్లుగా సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోండి. ఐటీఆర్ పోర్టల్‌లో ముందుగానే నమోదైన టీడీఎస్ వివరాలను మీ ఫామ్-16 లేదా ఫామ్-16Aతో క్రాస్ చెక్ చేసుకోండి. మీ బ్యాంకు ఖాతా వివరాలు (IFSC కోడ్, అకౌంట్ నంబర్) కచ్చితంగా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఐటీఆర్ సబ్మిట్ చేసిన వెంటనే మీ 'ఈ-వెరిఫికేషన్' ప్రక్రియను పూర్తి చేయండి. ఈ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్న్స్‌ను ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తుంది, ఇందులో ఆలస్యమైతే మీ రీఫండ్ నిలిచిపోయే ప్రమాదం ఉంది.

