Income Tax : ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక షాక్ ఇచ్చింది. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 నుంచి ఐటీఆర్-4 ఫైల్ చేసేవారు తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, ఆదాయానికి మించిన నగదు లావాదేవీలను గుర్తించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి 2026 మార్చి 30న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

పాత పద్ధతికి మంగళం.. కొత్త రూల్ ఏంటి?

ఇప్పటివరకు ఐటీఆర్-4 ఫైల్ చేసేటప్పుడు కేవలం బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంకు పేరు ఇస్తే సరిపోయేది. మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కొత్త నిబంధన ప్రకారం.. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మీ బ్యాంకు ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఇది ప్రధానంగా చిన్న వ్యాపారులు, ప్రొఫెషనల్స్ ఉపయోగించే ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీమ్‌లో మార్పులు తెస్తోంది.

ఎవరిపై ప్రభావం చూపుతుంది?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44AD, 44ADA, 44AE కింద రిటర్న్స్ దాఖలు చేసే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా:

* చిన్న తరహా వ్యాపారస్తులు.

* సాఫ్ట్‌వేర్ ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు.

* రవాణా రంగంలో ఉన్న ఆపరేటర్లు.

* ఉద్యోగం చేస్తూ ఇతర మార్గాల్లో (సైడ్ ఇన్కమ్) సంపాదిస్తున్న వారు.

వీరందరూ ఇకపై తమ బ్యాంకు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయానికి, బ్యాంకులో ఉన్న నగదుకు పొంతన లేకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నిఘా పెరుగుతుందా?

ఇకపై ఆదాయపు పన్ను శాఖ సాఫ్ట్‌వేర్లు మీ ఆదాయాన్ని, మీ బ్యాంకు లావాదేవీలతో ఆటోమేటిక్ గా సరిపోల్చుతాయి. మీరు తక్కువ ఆదాయం చూపిస్తూ బ్యాంకులో ఎక్కువ డబ్బు దాచినా లేదా భారీ నగదు జమ చేసినా వెంటనే దొరికిపోయే ప్రమాదం ఉంది. అందుకే ట్యాక్స్ పేయర్లు తమ ఆర్థిక రికార్డులను పక్కాగా నిర్వహించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది.

సీఏ సహాయం తప్పనిసరి?

ప్రభుత్వం ఐటీఆర్ ఫారాల్లో వరుసగా మార్పులు చేస్తూ, రిపోర్టింగ్ కఠినతరం చేస్తోంది. టెక్నాలజీ సాయంతో డేటా మ్యాచింగ్ జరుగుతున్నందున, చిన్న తప్పు చేసినా భారీ జరిమానాలు పడే ఛాన్స్ ఉంది. అందుకే చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు ఇకపై సొంతంగా కాకుండా, ఒక ప్రొఫెషనల్ ఆడిటర్ లేదా సీఏ సాయంతో రిటర్న్స్ ఫైల్ చేయడం ఉత్తమం. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే చిక్కుల నుండి తప్పించుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story