ITR Filing 2026-27 : ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ షురూ.. టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ITR Filing 2026-27 : దేశంలో ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆదాయపన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసే సమయం వచ్చేసింది. ఆర్థిక సంవత్సరం 2025-26లో మీ సంపాదనకు సంబంధించిన పన్ను వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువు లోపు తమ ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఎవరైనా ఈ గడువును నిర్లక్ష్యం చేస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి రావడమే కాకుండా, రావలసిన టాక్స్ రీఫండ్ లో కూడా తీవ్ర ఆలస్యం జరుగుతుందని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది.
మీ కేటగిరీని బట్టి ఐటీఆర్ చివరి తేదీలు ఇవే
ఆదాయపన్ను శాఖ వివిధ రకాల పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం వేర్వేరు డెడ్ లైన్లను ఖరారు చేసింది. ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారమ్‌లను దాఖలు చేసే సాధారణ జీతగాళ్లు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు జూలై 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అయితే, ఈసారి ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 దాఖలు చేసే చిన్న వ్యాపారస్తులకు ఒక పెద్ద ఊరట లభించింది. గతంలో వీరికి కూడా జూలై నెలే చివరి తేదీగా ఉండేది, కానీ ఈ ఏడాది నుంచి వీరికి ఆగస్టు 31, 2026 వరకు గడువు పొడిగించారు. ఇకపోతే, ఖాతాల ఆడిటింగ్ తప్పనిసరి అయిన పెద్ద వ్యాపార సంస్థలకు అక్టోబర్ 31, 2026 వరకు, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నిబంధనల పరిధిలోకి వచ్చేవారికి నవంబర్ 30, 2026 వరకు సమయం ఇచ్చారు.
డెడ్ లైన్ మిస్ అయితే జరిమానా ఎంతంటే?
ఒకవేళ మీరు పైన పేర్కొన్న నిర్దిష్ట గడువు తేదీలలోగా మీ రిటర్న్స్ దాఖలు చేయలేకపోతే, ఆ తర్వాత డిసెంబర్ 31, 2026 లోపు బిలేటెడ్ రిటర్న్ సమర్పించే అవకాశం ఉంటుంది. కానీ దీని కోసం మీరు భారీ ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ చట్టం సెక్షన్ 234F ప్రకారం.. మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే రూ.5,000 లేట్ ఫీజు కట్టాలి. అదే మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే గరిష్టంగా రూ.1,000 జరిమానా విధిస్తారు. ఈ పెనాల్టీతో పాటు మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఏమైనా బాకీ ఉంటే, దానికి ప్రతి నెలా అదనంగా వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ లేదా వ్యాపారంలో వచ్చిన నష్టాలను తదుపరి సంవత్సరాలకు బదిలీ చేసుకునే హక్కును కోల్పోతారు.
సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల కలిగే లాభాలు
ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది కేవలం ఒక ప్రభుత్వ రూల్ మాత్రమే కాదు, దీనివల్ల మీ ఆర్థిక రికార్డు చాలా బలంగా మారుతుంది. మీ జీతం నుంచి ఒకవేళ కంపెనీలు అదనంగా టీడీఎస్ కట్ చేసి ఉంటే, మీరు సమయానికి ఐటీఆర్ సబ్‌మిట్ చేయడం ద్వారా ఆ రీఫండ్ అమౌంట్ చాలా వేగంగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మీరు హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకులు మీ గత మూడేళ్ల ఐటీఆర్ కాపీలను అడుగుతాయి. మీ లోన్ రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి బ్యాంకులకు ఇదే ముఖ్యమైన డాక్యుమెంట్. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా ప్రాసెసింగ్ లో కూడా ఐటీఆర్ రశీదులు కీలక పాత్ర పోషిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి ఐటీ నోటీసులు, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు.
సబ్‌మిట్ బటన్ నొక్కే ముందు ఇవి సరిచూసుకోండి
ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు కంగారులో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫైలింగ్ చేసే ముందు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ముందుగా మీ ఆదాయ వనరులకు సరిపోయే సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆదాయపన్ను పోర్టల్‌లో లభించే ఫామ్ 26AS మరియు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ లలోని వివరాలను మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌తో క్రాస్-చెక్ చేసుకోవాలి. మీకున్న అన్ని రకాల ఆదాయాలను (బ్యాంక్ వడ్డీలు, షేర్ల లాభాలు మొదలైనవి) స్పష్టంగా చూపించాలి. మీ దగ్గర సరైన ఆధారాలు ఉన్న టాక్స్ డిడక్షన్లను మాత్రమే క్లెయిమ్ చేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఐటీఆర్ సబ్‌మిట్ చేసిన తర్వాత 30 రోజులలోపు దాన్ని ఈ-వెరిఫై చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ-వెరిఫికేషన్ చేయకపోతే ఆ ఐటీఆర్ పూర్తిగా అమాన్యంగా మారుతుంది.

