ITR Filing : ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల ప్రక్రియ దేశవ్యాప్తంగా జోరందుకుంది. పన్ను చెల్లింపుదారులు అందరూ తమ టాక్స్ వివరాలను సమర్పించే పనిలో పడ్డారు. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్లు కొంప ముంచుతాయి. దీనివల్ల భారీగా పెనాల్టీలు పడటమే కాకుండా, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నేరుగా లీగల్ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు మీకు రావాల్సిన రీఫండ్ డబ్బులు కూడా మధ్యలోనే నిలిచిపోతాయి. మరి ఎలాంటి టెన్షన్ లేకుండా సేఫ్‌గా ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలో, ఏ విషయాల్లో అస్సలు తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

తప్పుడు ఐటీఆర్ ఫామ్

ఐటీఆర్ ఫైలింగ్ లో చేసే మొదటి పెద్ద తప్పు.. మన ఆదాయ వనరులకు సరిపోని తప్పుడు ఫామ్‌ను సెలెక్ట్ చేసుకోవడం. మీ ఇన్కమ్ పరిమితి, జీతం, వ్యాపారం లేదా ఇతర పెట్టుబడుల ఆధారంగా ఐటీఆర్-1, ఐటీఆర్-2 వంటి సరైన ఫామ్‌లను మాత్రమే ఎంచుకోవాలి. అలా కాకుండా ఏది పడితే అది ఎంచుకుంటే, ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్న్‌ను డిఫెక్టివ్ గా ప్రకటించి ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తుంది. ఆ వెంటనే ఎందుకు తప్పుడు ఫామ్ పెట్టారో సమాధానం చెప్పాలంటూ మీ మెయిల్‌కు నోటీసు పంపుతుంది.

కేవలం జీతాన్నే చూపిస్తున్నారా..?

చాలామంది ఉద్యోగులు తాము చేసే పొరపాటు ఏంటంటే.. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు కేవలం తమకు వచ్చే నెలవారీ జీతం వివరాలను మాత్రమే చూపిస్తారు. కానీ, మీకు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ, కంపెనీల డివిడెండ్లు, ఇల్లు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే రెంట్, ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా వచ్చే అదనపు సంపాదన లాంటి వాటిని దాచిపెడుతుంటారు. ప్రస్తుతం ఐటీ శాఖ దగ్గర మీ ప్రతి పైసా లావాదేవీల లెక్క ఉంటుంది కాబట్టి, ఇలాంటి అదనపు ఆదాయాలను దాచిపెడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఫామ్ 16, ఏఐఎస్‎ల మధ్య తేడాలు ఉంటే అంతే సంగతులు

మీరు ఐటీఆర్ సబ్మిట్ చేయడానికి ముందే మీ కంపెనీ ఇచ్చే ఫామ్-16తో పాటు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉండే ఫామ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‎లను ఒకటికి రెండుసార్లు దగ్గర పెట్టుకుని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్లలో ఉన్న టాక్స్ కటింగ్స్ లెక్కలకు, మీరు ఐటీఆర్‌లో చూపే లెక్కలకు ఏమాత్రం తేడా వచ్చినా.. ఐటీ శాఖ దానిని రాంగ్ రిపోర్టింగ్‎గా పరిగణిస్తుంది. అందుకే అన్నీ సరిగ్గా మ్యాచ్ అయిన తర్వాతే ఫైలింగ్ పూర్తి చేయాలి.

అర్హత లేని డిడక్షన్లు క్లెయిమ్ చేస్తున్నారా..?

పన్ను ఆదా చేసుకోవాలనే ఆత్రుతతో చాలామంది తమకు అర్హత లేకపోయినా.. నకిలీ పత్రాలు లేదా తప్పుడు వివరాలతో సెక్షన్ 80C, 80D కింద భారీగా డిడక్షన్లు క్లెయిమ్ చేస్తుంటారు. అలాగే కొందరు తమకు లీగల్‌గా వచ్చే డిడక్షన్లను సరిగ్గా క్లెయిమ్ చేయడం మర్చిపోతుంటారు. ఈ రెండు పద్ధతుల వల్ల మీ టాక్స్ లయబిలిటీ మారిపోతుంది. ఒకవేళ మీరు కావాలని తప్పుడు డిడక్షన్లు పెట్టినట్లు ఐటీ అధికారుల తనిఖీల్లో తేలితే.. కట్టాల్సిన పన్నుతో పాటు భారీగా జరిమానా కూడా వసూలు చేస్తారు.

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసారా..?

ప్రస్తుత రోజుల్లో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ప్రాపర్టీ లావాదేవీలు చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ ఏడాదిలో మీరు ఏవైనా షేర్లు లేదా స్థలాలు అమ్మి లాభాలు పొందితే.. దానికి సంబంధించిన షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వివరాలను ఐటీఆర్‌లో పక్కాగా నమోదు చేయాలి. వీటిని దాచాలని చూస్తే, మీ పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఐటీ శాఖ సిస్టమ్స్ వెంటనే పట్టుకుని మీకు ట్యాక్స్ నోటీస్ పంపేలా అలర్ట్ చేస్తాయి.

విదేశీ ఆస్తులు, ఫారిన్ ఇన్కమ్ దాస్తే భారీ శిక్ష

మీకు గనక విదేశాల్లో బ్యాంక్ అకౌంట్లు, కంపెనీ షేర్లు లేదా ఏదైనా ఆస్తులు ఉంటే.. వాటికి సంబంధించిన వంద శాతం సమాచారాన్ని ఐటీఆర్‌లో డిక్లేర్ చేయడం చట్టప్రకారం తప్పనిసరి. వీటిని గుప్తంగా ఉంచితే నల్లధనం చట్టం కింద భారీ పెనాల్టీలు పడతాయి. అలాగే, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పాత టాక్స్ విధానం, కొత్త టాక్స్ విధానంలలో దేనిలో మీకు ఎక్కువ పన్ను ఆదా అవుతుందో ముందే క్యాలిక్యులేట్ చేసుకుని సరైన ఆప్షన్ ఎంచుకోవాలని టాక్స్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

చివరి తేదీ వరకు వెయిట్ చేయకండి

ఐటీఆర్ ఫైల్ చేయడానికి ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ దాటిపోతే లేట్ ఫీజు, వడ్డీ భారం పడుతుంది. అంతేకాకుండా మీ నష్టాలను తర్వాతి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకునే ఛాన్స్ కోల్పోతారు. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత నిర్దేశిత సమయం లోపు ఈ-వెరిఫికేషన్ చేయడం అత్యంత ముఖ్యం. ఇది చేయకపోతే మీరు ఫైల్ చేసిన ఐటీఆర్ చెల్లకుండా పోతుంది. అలాగే, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను ముందే వాలిడేట్ చేసుకోండి, లేదంటే మీకు రావాల్సిన టాక్స్ రీఫండ్ డబ్బులు బ్యాంకు అకౌంట్ లో పడకుండా మధ్యలోనే ఆగిపోతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story