ITR Filing : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు అలాగే విదేశాల్లో ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు ఉన్న పన్ను చెల్లింపుదారుల మనస్సులో ఒక పెద్ద ప్రశ్న మెదులుతోంది. తాము ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలన్నింటినీ ప్రభుత్వానికి చూపించాలా? లేదా? అని చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. అయితే ట్యాక్స్ నిపుణుల సమాచారం ప్రకారం, కేవలం ఎన్‌ఆర్‌ఐ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరూ తమ విదేశీ ఆస్తుల వివరాలను ఐటీఆర్‌లో వెల్లడించాల్సిన అవసరం లేదు. దీనికోసం ప్రత్యేకంగా ఉండే షెడ్యూల్ ఎఫ్ఏ ఫామ్‌ను నింపడం అనేది పూర్తిగా సదరు ఆర్థిక సంవత్సరంలో మీ ట్యాక్స్ రెసిడెన్సీ హోదాపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

అసలు షెడ్యూల్ ఎఫ్ఏ వరికి వర్తిస్తుంది?

భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. కేవలం రెసిడెంట్ అండ్ ఆర్డినరిలీ రెసిడెంట్ (ROR) కేటగిరీ కిందకు వచ్చే పన్ను చెల్లింపుదారులు మాత్రమే తమ ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు విదేశీ ఆస్తుల వివరాలను ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ షెడ్యూల్‌లో విదేశాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, స్థిరాస్తులు, అంతర్జాతీయ ట్రస్టులలో ఉన్న భాగస్వామ్యం వంటి అన్ని రకాల విదేశీ ఆర్థిక వనరుల సమాచారాన్ని నమోదు చేయాలి. మరోవైపు, ఒక వ్యక్తి చట్ట ప్రకారం ఎన్‌ఆర్‌ఐ లేదా రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరిలీ రెసిడెంట్ (RNOR) కేటగిరీలో ఉంటే, వారు సాధారణ పరిస్థితుల్లో ఈ షెడ్యూల్ ఎఫ్ఏ నింపాల్సిన అవసరం లేదు. అందువల్ల రిటర్నులు సబ్మిట్ చేసే ముందే మీ రెసిడెన్షియల్ హోదాను సరిగ్గా లెక్కించడం చాలా ముఖ్యం.

విదేశీ ఆస్తుల ఏయే వివరాలను ఐటీఆర్‌లో చూపించాలి?

ఎవరికైతే షెడ్యూల్ ఎఫ్ఏ నిబంధన వర్తిస్తుందో, వారు విదేశీ బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు కస్టడీ లేదా డిపాజిటరీ అకౌంట్లు, విదేశీ కంపెనీల ఈక్విటీ షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, విదేశాల్లో ఉన్న ఇళ్లు, స్థలాల పూర్తి వివరాలను ఐటీ శాఖకు సమర్పించాలి. చాలా సందర్భాలలో సదరు విదేశీ ఖాతాలో ఒక ఏడాదిలో నమోదైన గరిష్ట బ్యాలెన్స్ ఎంత, అలాగే ఆ పెట్టుబడుల ప్రస్తుత విలువ ఎంత అనే విషయాలను కూడా స్పష్టంగా పేర్కొనాలి. దీనితో పాటు ఆయా విదేశీ ఆస్తులు లేదా పెట్టుబడుల ద్వారా మీకు ఏదైనా అదనపు ఆదాయం లేదా లాభాలు వచ్చి ఉంటే, వాటిని కూడా మీ ట్యాక్స్ రిటర్నులలో చూపించడం చట్టబద్ధంగా విధిగా మార్చారు.

వివరాలు దాస్తే భారీ పెనాల్టీ

విదేశీ ఆస్తుల సమాచారాన్ని కావాలనే దాచడం లేదా ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలను నమోదు చేయడం వంటివి చట్టప్రకారం చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి. పన్ను నిపుణుల హెచ్చరికల ప్రకారం, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే బ్లాక్ మనీ యాక్ట్ 2015 కింద ఆదాయపు పన్ను శాఖ కఠినమైన విచారణ చేపడుతుంది. ఈ చట్టం కింద పన్ను ఎగవేతదారులపై భారీగా జరిమానాలు విధించడమే కాకుండా ఇతర చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ నియమం పరిధిలోకి వచ్చే వారు తమ వద్ద ఉన్న గ్లోబల్ అసెట్స్ వివరాలను అత్యంత జాగ్రత్తగా, నమ్మకంగా వెల్లడించడం శ్రేయస్కరం.

సరైన ఐటీఆర్ ఫామ్ ఎంపిక ఇలా

షెడ్యూల్ ఎఫ్ఏ ద్వారా విదేశీ ఆస్తుల వివరాలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులు సాధారణంగా వాడే ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫామ్‌లను ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ప్రాథమిక ఫామ్‌లలో విదేశీ ఆస్తుల వివరాలను నమోదు చేయడానికి ఎలాంటి ఆప్షన్లు లేదా ప్రత్యేక కాలమ్‌లు ఉండవు. ఇలాంటి సందర్భాలలో పన్ను చెల్లింపుదారులు సాధారణంగా ఐటీఆర్-2 లేదా వారి ఆదాయ వనరులకు సరిపోయే ఇతర తగిన ఐటీఆర్ ఫామ్‌లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే రిటర్నులు దాఖలు చేయడానికి ముందే మీ రెసిడెన్షియల్ హోదా, విదేశీ ఆదాయం, ఆస్తుల స్థితిగతులను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. దీనివల్ల రిటర్నులు తప్పుల్లేకుండా ఫైల్ అవ్వడమే కాకుండా, భవిష్యత్తులో ఐటీ శాఖ నుంచి వచ్చే నోటీసులు లేదా ఇతర లీగల్ ఇబ్బందుల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story