ITR Filing : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సీజన్ నడుస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు తమ పన్ను రిటర్నులను సమర్పిస్తున్నారు. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తాయని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటు సమాచారం ఇవ్వడం, వచ్చిన ఆదాయాన్ని దాచడం లేదా డాక్యుమెంట్లను సరిగ్గా సరిపోల్చకపోవడం వల్ల ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల అదనపు పన్నుతో పాటు భారీగా వడ్డీ, జరిమానాలు కూడా చెల్లించాల్సి వస్తుంది.

కేవలం ఫామ్-16 నమ్ముకుంటే సరిపోదు

చాలా మంది ఉద్యోగులు చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే.. ఆఫీస్ వాళ్లు ఇచ్చే ఫామ్-16 ఆధారంగా మాత్రమే ఐటీఆర్‌ను ఫైల్ చేసేస్తుంటారు. అయితే పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా తప్పుడు పద్ధతి. రిటర్న్స్ దాఖలు చేయడానికి ముందు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), ఫామ్ 26ASలలో ఉన్న సమాచారాన్ని ఫామ్-16 తో కచ్చితంగా సరిపోల్చాలి. చాలా సార్లు బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ పై వచ్చే వడ్డీ, ఎఫ్‌డీల ద్వారా వచ్చే ఆదాయం, టీడీఎస్ కటింగ్‌లు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలు ఫామ్-16 లో ఉండవు కానీ, ఏఐఎస్, 26AS లో స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని గమనించకుండా వదిలేస్తే ఐటీ నోటీసులు రావడం ఖాయం.

ఆదాయం దాచారా.. అంతే సంగతులు

ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు కేవలం జీతం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూపిస్తే సరిపోదు. మీకు వచ్చే ప్రతి ఒక్క పైసా సంపాదనను ఐటీ శాఖకు తెలపాలి. బ్యాంకు ఎఫ్‌డీలు, సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీ, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ విక్రయించడం ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్స్, ఇల్లు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే అద్దె ఆదాయం, ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా వచ్చే సంపాదన లేదా ఇతర ఏ వనరుల ద్వారా ఆదాయం వచ్చినా వాటన్నింటినీ రిటర్న్స్‌లో చేర్చాలి. ఏ ఒక్క ఆదాయ వనరును దాచినా ఐటీ డిపార్ట్‌మెంట్ ఈజీగా కనిపెట్టేసి నోటీసులు పంపుతుంది.

ఓల్డ్ వర్సెస్ న్యూ టాక్స్ రిజీమ్

ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంలలో ఏది మీకు లాభదాయకమో సరిగ్గా ఎంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఉద్యోగులు ఎలాంటి ముందస్తు లెక్కలు వేసుకోకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఏదో ఒక టాక్స్ రిజీమ్‌ను బ్లైండ్‌గా ఎంచుకుంటారు. దీనివల్ల వారు అర్హులైన మినహాయింపులు కోల్పోయి, అవసరమైన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. అందుకే రిటర్న్స్ సమర్పించే ముందే రెండు విధానాల్లోనూ పన్ను బాధ్యతను లెక్కించి, దేంట్లో పన్ను తక్కువ పడుతుందో దానినే ఎంచుకోవాలి.

దొంగ బిల్లులతో టాక్స్ మినహాయింపులు కోరుతున్నారా?

సరైన డాక్యుమెంట్లు, రశీదులు లేకుండా పన్ను మినహాయింపులు లేదా తగ్గింపులను క్లెయిమ్ చేయవద్దని నిపుణులు గట్టిగా చెప్తున్నారు. సెక్షన్ 80C, 80D, హోమ్ లోన్ వడ్డీ లేదా ఇతర టాక్స్ సేవింగ్స్ మినహాయింపులను క్లెయిమ్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన అసలైన బిల్లులు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్‌లు మీ దగ్గర ఉండాలి. పన్ను తగ్గించుకోవాలనే ఆశతో తప్పుడు క్లెయిమ్‌లు చేస్తే, స్క్రూటినీలో ఐటీ శాఖ వాటిని తిరస్కరిస్తుంది. ఫలితంగా అదనపు పన్నుతో పాటు భారీ పెనాల్టీలు కూడా కట్టాల్సి వస్తుంది.

బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఇస్తే రీఫండ్ గోవిందా

ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను చాలా జాగ్రత్తగా, తప్పులు లేకుండా నమోదు చేయాలి. వీటిలో చిన్న అంకె మారినా మీకు రావాల్సిన టాక్స్ రీఫండ్ డబ్బులు రాకుండా మధ్యలోనే నిలిచిపోతాయి. వీటన్నింటితో పాటు ఐటీఆర్ సబ్మిట్ చేసిన తర్వాత నిర్ణీత గడువు లోపు ఈ-వెరిఫికేషన్ చేయడం అత్యంత ముఖ్యం. ఒకవేళ మీరు ఎంత కరెక్ట్‌గా ఐటీఆర్ ఫైల్ చేసినా, దానిని ఈ-వెరిఫై చేయకపోతే ఆ రిటర్న్స్ చెల్లుబాటు కావు. అది ఫైల్ చేయనట్లుగానే ఐటీ శాఖ పరిగణిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అంతా పరిశీలించుకుని ఐటీఆర్ సబ్మిట్ చేయడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story