ITR Filing : 2026-27 అసెస్‌మెంట్ ఇయర్‎కి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు రికార్డు స్థాయిలో వేగం పుంజుకుంది. ఇప్పటికే ఐదు కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ ఫైలింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులకు జూలై 31 చివరి తేదీ అని గుర్తు చేస్తూ, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫారమ్‌లను పూర్తి చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.

చివరి నిమిషంలో ఫైల్ చేస్తే వచ్చే తిప్పలు ఇవే

సాధారణంగా గడువు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు, సర్వర్ డౌన్ కావడం, ఓటీపీ వెరిఫికేషన్‌లో ఆలస్యం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. చివరి క్షణంలో గందరగోళంలో తప్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ జూలై 31 గడువు దాటితే లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి రావడమే కాకుండా, బకాయి ఉన్న పన్నుపై వడ్డీ పడుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల నష్టాలను తర్వాతి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటును కూడా పన్ను చెల్లింపుదారులు కోల్పోతారు.

ఐటీఆర్-1 ఎవరు దాఖలు చేయాలి?

భారతదేశంలో నివసిస్తూ ఆర్థిక సంవత్సరం 2025-26లో రూ. 50 లక్షల వరకు మొత్తం ఆదాయం కలిగిన వ్యక్తులు ఐటీఆర్-1ను ఎంచుకోవాలి. జీతం లేదా పెన్షన్ ద్వారా ఆదాయం వచ్చేవారు, ఒక ఇంటి ఆస్తి ద్వారా ఆదాయం పొందుతున్నవారు, డిపాజిట్లపై వచ్చే వడ్డీ వంటి ఇతర మార్గాల ద్వారా ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులు. అలాగే వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రూ. 5,000 దాటకూడదు. అయితే క్యాపిటల్ గేన్స్ (షేర్లు, ఆస్తుల విక్రయం), బిజినెస్ లేదా ప్రొఫెషన్ ఆదాయం ఉన్నవారు, విదేశీ ఆస్తులు కలిగినవారు, లేదా అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో పెట్టుబడి ఉన్నవారు ఐటీఆర్-1 వేయడానికి అర్హులు కారు.

ఐటీఆర్-2 ఫారమ్ ఎవరి కోసం?

ఐటీఆర్-1 ఫారమ్‌కు అర్హత లేని, వ్యాపారం లేదా ప్రొఫెషన్ మినహా ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐటీఆర్-2 వేయాలి. ముఖ్యంగా ఏడాదికి రూ. 50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు, ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల ఆస్తులు ఉన్నవారు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లేదా ల్యాండ్ విక్రయించి క్యాపిటల్ గేన్స్ పొందినవారు, విదేశీ ఆదాయం లేదా ఆస్తులు ఉన్నవారు ఐటీఆర్-2 ఫైల్ చేయాల్సి ఉంటుంది.

రిటర్న్స్ వేసే ముందు ఇవి సరిచూసుకోండి

రిటర్న్స్ సబ్మిట్ చేయడానికి ముందు పన్ను చెల్లింపుదారులు తమ ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), ఫారమ్ 16లలోని వివరాలను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆదాయ వివరాలలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా చూసుకుంటే ప్రాసెసింగ్ వేగంగా జరిగి, రీఫండ్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం డెడ్‌లైన్ పొడిగించే ఆలోచనలో లేకపోవడంతో వెంటనే ఫైలింగ్ పూర్తి చేయడం శ్రేయస్కరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story