మళ్లీ గడువు పొడిగిస్తారా ?

Income Tax Returns : సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. అయితే, ఈసారి వివిధ ఫారమ్‌లు ఇంకా రిలీజ్ కాకపోవడం, ఇతర కారణాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువును జూలై 31 నుండి సెప్టెంబర్ 15కి పొడిగించారు. ఈ గడువుకు ఇప్పుడు 50 రోజుల కన్నా సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడానికి మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ దాఖలు ప్రక్రియను సులభతరం చేయడానికి వివిధ ఐటీఆర్ ఫారమ్‌లను సవరించింది. ఈ మార్పుల కారణంగానే మొదట సెప్టెంబర్ 15 వరకు గడువును పొడిగించారు. ఇప్పుడు కొన్ని ఐటీఆర్ ఫారమ్‌లకు అవసరమైన యుటిలిటీస్ పన్ను చెల్లింపుదారుల వద్ద లేవని తెలిసింది. ముఖ్యంగా, ఐటీఆర్ ఫారమ్ 5, 6, 7 కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యుటిలిటీలను ఆదాయపు పన్ను శాఖ ఇంకా విడుదల చేయలేదు. ఈ కారణం వల్లే సెప్టెంబర్ 15న ఉన్న చివరి తేదీని మరింత పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటివరకు ఆదాయపు పన్ను శాఖ నుండి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ గడువు పొడిగించబడితే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. గతంలో కూడా ఇలాంటి కొన్ని సందర్భాలలో ఐటీఆర్ సమర్పణకు గడువును పొడిగించారు. కాబట్టి, ఈసారి కూడా అలాంటి అవకాశం ఉండొచ్చు. ఈసారి ఐటీఆర్ సమర్పణలో ఆలస్యానికి ప్రభుత్వమే కారణమని తెలుస్తోంది. ఐటీఆర్ ఫారమ్‌ల సాంకేతిక అంశాలను అప్‌డేట్ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఐటీఆర్ ఫారమ్‌లకు సంబంధించిన యుటిలిటీలను ఆలస్యంగా విడుదల చేసింది. ఒకవేళ ఫారమ్ 5, 6, 7 యుటిలిటీలను విడుదల చేయడానికి ఇంకా ఆలస్యం చేస్తే, సెప్టెంబర్ 15 నాటి గడువు ముందుకు వెళ్ళడం ఖాయం.

ఈ ఆలస్యం వల్ల పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా పన్ను నిపుణులు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైన టూల్స్ అందుబాటులో లేకపోవడంతో ITR దాఖలు చేయడంలో జాప్యం జరుగుతోంది. కాబట్టి, పన్ను చెల్లింపుదారులందరూ అధికారిక ప్రకటన కోసం వేచి చూడడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story