ఫారమ్ వచ్చింది కదా అని అప్‌లోడ్ చేస్తే.. మీ రీఫండ్ గోవిందా

Income Tax : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 (ఆర్థిక సంవత్సరం 2025-26)కు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కీలక అడుగు వేసింది. మొత్తం ఏడు రకాల ఐటీఆర్ ఫారమ్‌లతో పాటు, వెరిఫికేషన్ కోసం ITR-V, అప్‌డేటెడ్ రిటర్న్స్ కోసం ITR-U ఫారమ్‌లను నోటిఫై చేసింది. అయితే, ఫారమ్‌లు వచ్చేశాయి కదా అని వెంటనే ఫైల్ చేయడానికి సిద్ధపడితే మాత్రం మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఎందుకు వేచి ఉండాలో, అసలు ఫైలింగ్ ఎప్పుడు మొదలవుతుందో వివరంగా తెలుసుకుందాం.

ఫారమ్‌లు వచ్చాయి.. కానీ సాఫ్ట్‌వేర్ సిద్ధంగా లేదు!

ఐటీ శాఖ ఫారమ్‌లను విడుదల చేయడం అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. మనం ఆన్‌లైన్‌లో రిటర్న్స్ దాఖలు చేయాలంటే ఎక్సెల్, జేసన్ యూటిలిటీలు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి రావాలి. ఈ సాఫ్ట్‌వేర్ టూల్స్ సహాయంతోనే ట్యాక్స్ ప్రొఫెషనల్స్ డేటాను అప్‌లోడ్ చేస్తారు. ప్రస్తుతం పోర్టల్‌లో బ్యాకెండ్ టెస్టింగ్ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యి, సిస్టమ్ స్థిరపడటానికి సాధారణంగా మే నెల మధ్య వరకు సమయం పడుతుంది. అప్పటి వరకు మనం రిటర్న్స్ ఫైల్ చేయడానికి సాంకేతికంగా వీలుండదు.

ఏ ఐటీఆర్ ఫారమ్ ఎవరి కోసం?

మీ ఆదాయ వనరులను బట్టి మీరు సరైన ఫారమ్‌ను ఎంచుకోవాలి. ప్రభుత్వం నోటిఫై చేసిన వివరాలు ఇలా ఉన్నాయి:

ITR-1 (సహజ్): రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉండి, జీతం లేదా ఒకే ఇల్లు ఉన్న వ్యక్తుల కోసం.

ITR-2: క్యాపిటల్ గెయిన్స్ (షేర్లు, ఆస్తుల అమ్మకం) లేదా ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు, HUFల కోసం.

ITR-3: వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం.

ITR-4 (సుగమ్): చిన్న వ్యాపారులు, నిపుణులు (ప్రిజమ్టివ్ ఇన్కమ్) కోసం.

ITR-5, 6, 7: కంపెనీలు, ట్రస్టులు, సంస్థలు, ఫర్మ్‌ల కోసం కేటాయించారు.

జూన్ వరకు వేచి ఉండటమే ఉత్తమం.. ఎందుకు?

మే నెలలో పోర్టల్ ఓపెన్ అయినా సరే, ట్యాక్స్ నిపుణులు మాత్రం జూన్ మధ్య వరకు ఆగమని సలహా ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం AIS (Annual Information Statement), Form 26AS. మనం ఏడాది పొడవునా చేసిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకులు కట్ చేసిన టీడీఎస్ వివరాలు ఈ ఫారమ్‌లలో అప్‌డేట్ కావాలి. కంపెనీలు తమ చివరి త్రైమాసిక టీడీఎస్ రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి మే 31 వరకు సమయం ఉంటుంది. ఆ తర్వాతే మీ డేటా పూర్తిగా రిఫ్లెక్ట్ అవుతుంది. ముందే ఫైల్ చేస్తే, మీ లెక్కలకు.. ఐటీ శాఖ దగ్గరున్న డేటాకు తేడా వచ్చి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.

తొందర వద్దు.. ముందు జాగ్రత్త ముద్దు

గతంలో తొందరపడి ఐటీఆర్ ఫైల్ చేసిన వారు డేటా మిస్‌మ్యాచ్ వల్ల రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి వచ్చింది. అందుకే, ప్రస్తుతానికి మీ దగ్గరున్న డాక్యుమెంట్లను (పెట్టుబడుల రశీదులు, లోన్ సర్టిఫికేట్లు) సిద్ధం చేసుకుని భద్రపరుచుకోండి. జూన్ రెండో వారం తర్వాత మీ AIS డేటాను క్రాస్ చెక్ చేసుకుని రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల ఎలాంటి తప్పులు లేకుండా పని పూర్తవుతుంది. సరైన ప్లానింగ్‌తో రిటర్న్స్ ఫైల్ చేస్తే ట్యాక్స్ రీఫండ్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story