ITR Refund : ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ ప్రాసెస్డ్ కానీ డబ్బుల్లేవా? రీ-ఇష్యూ కోసం ఇలా చేయండి
రీ-ఇష్యూ కోసం ఇలా చేయండి

ITR Refund : మీరు సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసి, దాని స్టేటస్ ప్రాసెస్డ్ అని చూపిస్తున్నప్పటికీ, మీ బ్యాంక్ ఖాతాలో రిఫండ్ డబ్బు జమ కాకపోయిందా? అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఐటీఆర్ ప్రాసెస్ అయిన తర్వాత 7 నుండి 21 పనిదినాలలోపు రిఫండ్ వస్తుంది. కానీ ఆలస్యం జరిగితే, దానికి గల కారణాన్ని తెలుసుకుని, తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.
ఆదాయపు పన్ను రిఫండ్‌లో ఆలస్యం కావడానికి కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్ తప్పుగా ఉండడం లేదా మీ బ్యాంక్ ఖాతా ఇ-వెరిఫై కాకపోవడం లేదా ఆధార్ నంబర్ లింక్ కాకపోవడం, ఫారం 26ఏఎస్ మీ ఐటీఆర్ వివరాలలో ఏదైనా తేడా ఉండటం, టీడీఎస్ వివరాలు సరిగ్గా సరిపోలకపోవడం, రిఫండ్ మొత్తాన్ని బ్యాంక్ తిరస్కరించడం వంటి కారణాలు ఉండొచ్చు.
ఐటీఆర్ ఫైల్ చేసిన తేదీ, ప్రాసెసింగ్ వేగాన్ని బట్టి సాధారణంగా 4 నుండి 5 వారాలు పట్టవచ్చు. మీ రిటర్న్ ఆలస్యంగా ప్రాసెస్ అయితే, కొంతకాలం వేచి ఉండటం మంచిది.
రిఫండ్ రానివారు పాటించాల్సిన స్టెప్స్
రిఫండ్ డబ్బు ఖాతాలో జమ కాకపోతే, ఈ క్రింది విధంగా ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి రిఫండ్ రీ-ఇష్యూ కోసం దరఖాస్తు చేయవచ్చు.
ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి: ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ లోకి వెళ్లి, మీ లాగిన్ వివరాలు, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
స్టేటస్ తనిఖీ: లాగిన్ అయిన తర్వాత రిఫండ్ / డిమాండ్ స్టేటస్ అనే విభాగంలోకి వెళ్లండి. అక్కడ రిఫండ్ ఎప్పుడు ప్రాసెస్ అయింది, ఎంత మొత్తం పంపబడింది అనే వివరాలు కనిపిస్తాయి.
బ్యాంక్ వివరాలు సరిచూసుకోండి: స్టేటస్ Processed అని చూపించినప్పటికీ డబ్బు రాకపోతే, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
రీ-ఇష్యూ రిక్వెస్ట్: బ్యాంక్ వివరాలు సరిగ్గా ఉండి కూడా డబ్బు రాకపోతే, మీరు రిఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పెట్టాలి. ఈ అభ్యర్థనను సమర్పించిన తర్వాత, రిఫండ్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమై, కొద్ది రోజుల్లో డబ్బు మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది.
