Pernod Ricard India : అమెరికాను వెనక్కి నెట్టి వేగంగా వృద్ధి చెందుతున్న ఆల్కహాల్ మార్కెట్‌గా భారత్
ఆల్కహాల్ మార్కెట్‌గా భారత్

Pernod Ricard India :బ్లెండర్స్ ప్రైడ్, రాయల్ స్టాగ్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లను తయారుచేసే ఫ్రెంచ్ డిస్టిలర్ పర్నోడ్ రికార్డ్ ఒక కీలక ప్రకటన చేసింది. పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ, మారుతున్న జీవనశైలి, యువత కొనుగోలు శక్తి కారణంగా, భవిష్యత్తులో అమెరికాను అధిగమించి భారత్ తమకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా మారుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రస్తుతం గ్లోబల్ అమ్మకాలలో 13% వాటాతో చైనాను వెనక్కి నెట్టి భారత్ రెండవ స్థానంలో ఉంది. పర్నోడ్ రికార్డ్ ఇండియా సీఈవో జీన్ టూబౌల్ ప్రకారం.. భారత్‌లో ఆదాయం పెరగడం, మద్యం వినియోగం పట్ల దృక్పథం మారడం, ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల మంది కొత్త యువకులు చట్టబద్ధమైన వయస్సుకు చేరుకోవడం వంటి అంశాలు ప్రీమియం బ్రాండ్‌లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.
పర్నోడ్ రికార్డ్ సంస్థ భారత్‌లో ప్రీమియం, సూపర్-ప్రీమియం బ్రాండ్‌లపై మరింత దృష్టి పెట్టడానికి తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈ వ్యూహంలో భాగంగా, కంపెనీ ఇటీవల తన ప్రసిద్ధ బ్రాండ్ ఇంపీరియల్ బ్లూను తిలక్‌నగర్ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. భారతదేశంలో హై-ఎండ్ విభాగంలో వృద్ధి అత్యంత వేగంగా ఉందని, రాబోయే సంవత్సరాల్లో ఇది పెద్ద వ్యాపారంగా మారుతుందని కంపెనీ నమ్ముతోంది. ఈ దిశగా, కంపెనీ విస్కీ, జిన్, వోడ్కా, రమ్, బ్రాందీలలో స్థానిక మల్టీ-కేటగిరీ రేంజ్‌ను కూడా ప్రవేశపెట్టింది. రాబోయే వృద్ధిలో 25% కొత్త ఆవిష్కరణల ద్వారా వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, చైనా వంటి మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వలన పర్నోడ్ రికార్డ్ అమ్మకాలలో తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ భారతీయ మార్కెట్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ, మహారాష్ట్రలో ఎక్సైజ్ పాలసీ మార్పుల వల్ల ఏర్పడిన తొలి షాక్‌ను అధిగమించి, FY26 మొదటి త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 3% పెరిగాయి. సీఈఓ ప్రకారం.. కంపెనీ తక్కువ-స్థాయి బ్రాండ్ల నుంచి ప్రీమియం విభాగంపై దృష్టి సారించడం వలన వృద్ధి మరింత వేగవంతమవుతుంది. ఈ ట్రెండ్ కారణంగా, రాబోయే కొన్నేళ్లలో భారత్ అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆల్కహాల్ మార్కెట్‌గా మారుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

