SEBI : భారత మార్కెట్‌లో అమెరికన్ కంపెనీ రూ. 36,500 కోట్ల భారీ కుంభకోణం.. సెబీ కంపెనీ కీలక నిర్ణయం
సెబీ కంపెనీ కీలక నిర్ణయం

SEBI : అమెరికన్ ట్రేడింగ్ కంపెనీ జెన్ స్ట్రీట్ పై సెబీ నిషేధం విధించింది. ఈ కంపెనీ షేర్ మార్కెట్‌లో మోసాలు చేసి, ఏకంగా రూ.36,500 కోట్లు సంపాదించిందని ఆరోపణలు ఉన్నాయి. సెబీ దీనిపై ప్రస్తుతం తాత్కాలిక నిషేధం విధించింది. విచారణ పూర్తయిన తర్వాత కంపెనీని పూర్తిగా నిషేధించే అవకాశం ఉంది. ఈ అమెరికన్ కంపెనీపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన రెగ్యులేటరీ బోర్డు రూ.4,843 కోట్ల అక్రమ ఆదాయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
జెన్ స్ట్రీట్ అనేది అమెరికాకు చెందిన ఒక హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీ. ఈ కంపెనీ సెకనులో చాలా తక్కువ సమయంలో షేర్లను కొని, అమ్మేస్తుంది. తమకున్న ఈ సాంకేతికతను ఉపయోగించుకొని, ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లో మోసాలకు పాల్పడింది. దీనికోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌ను ఎంచుకొని పెట్టుబడిదారులను కోట్లలో ముంచేసింది. ఈ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ మోసం చేయడానికి రెండు పద్ధతులను ఉపయోగించింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌ను క్యాష్ మార్కెట్‌తో సమన్వయం చేసుకోవడం, ఎక్స్‌పైరీ తేదీ నాడు షేర్ల ధరలను పెంచి మోసం చేయడం అనే రెండు టెక్నిక్స్ వాడింది.
ఉదాహరణకు.. ఒక షేరు రూ.1,200 వద్ద ట్రేడ్ అవుతోందని అనుకుందాం. జెన్ స్ట్రీట్ అనే కంపెనీ ముందుగా రూ.1,202 ధర వద్ద ఫ్యూచర్‌లలో 10,000 లాట్‌లను కొనుగోలు చేసింది. అదే సమయంలో, రూ.3 ధర వద్ద 10,000 లాట్‌ల రూ.1,220 కాల్ ఆప్షన్‌ను కూడా తీసుకుంది. ఆ తర్వాత, కంపెనీ క్యాష్ మార్కెట్‌లో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టి ఆ షేర్ ధరను పెంచింది. షేర్ ధర రూ.1,320కి చేరగానే, ఫ్యూచర్స్ నుంచి రూ.73.75 కోట్ల లాభం, ఆప్షన్స్ నుంచి రూ.60.62 కోట్ల లాభం వచ్చాయి. ఈ విధంగా, రూ.50 కోట్ల పెట్టుబడిపై కంపెనీ మొత్తం రూ.134 కోట్లకు పైగా సంపాదించింది.
ఈ కంపెనీ జనవరి 2023 నుండి మార్చి 2025 మధ్య ఒక నిర్దిష్ట పద్ధతిని అనుసరించి ఈ కుంభకోణాన్ని చేసింది. జెన్ స్ట్రీట్ ఎక్స్‌పైరీ రోజున బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీలో పెద్ద వ్యూహాన్ని అమలు చేసింది. ఉదయం కంపెనీ భారీ మొత్తంలో స్టాక్‌లను, ఫ్యూచర్స్‌ను కొనుగోలు చేసింది. ఆపై ఆప్షన్స్‌లో షార్ట్ పొజిషన్స్ తీసుకొని మధ్యాహ్నం స్టాక్‌లను విక్రయించింది. దీనివల్ల ఇండెక్స్ పడిపోయింది. ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభం వచ్చింది. చాలాసార్లు, కంపెనీ చివరి రెండు గంటల్లో నిఫ్టీకి సంబంధించిన స్టాక్‌లను కొనుగోలు చేసింది. ఆప్షన్ల ద్వారా లాంగ్ పొజిషన్స్ తీసుకుంది. దీనివల్ల ఇండెక్స్ పెరిగింది. ఆప్షన్లు లాభంతో అమ్ముడుపోయాయి.
