Gold Stocks Crash : ఇన్వెస్టర్లను వణికించిన ప్రధాని మోదీ మాటలు.. జ్యువెలరీ షేర్లలో భారీ అమ్మకాలు
జ్యువెలరీ షేర్లలో భారీ అమ్మకాలు

Gold Stocks Crash : స్టాక్ మార్కెట్‌లో సోమవారం జ్యువెలరీ రంగం షేర్లు కుదేలయ్యాయి. ఒకవైపు అద్భుతమైన లాభాలతో కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తున్నప్పటికీ, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ప్రకటన ఇన్వెస్టర్లలో ఆందోళన నింపింది. దీంతో టైటాన్, సెన్కో గోల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. అసలు మార్కెట్‌లో ఈ సునామీ ఎందుకు వచ్చింది? బంగారం షేర్లు ఎందుకు కుప్పకూలాయో ఇప్పుడు చూద్దాం.
ప్రధాని మోదీ విజ్ఞప్తి.. మార్కెట్‌లో ప్రకంపనలు
హైదరాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు జ్యువెలరీ రంగాన్ని తాకాయి. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి, ఇంధన పొదుపు కోసం ప్రజలు కనీసం ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనడం తగ్గించాలని ఆయన కోరారు. అలాగే అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, వీలైతే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని అనుసరించాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే ఉద్దేశంతో ఆయన ఈ పిలుపునిచ్చినప్పటికీ, బంగారం డిమాండ్ తగ్గిపోతుందేమోనన్న భయంతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు.
కుప్పకూలిన షేర్లు.. ఎవరికి ఎంత నష్టం?
సోమవారం ట్రేడింగ్‌లో జ్యువెలరీ స్టాక్స్ దాదాపు 9 శాతం వరకు పతనమయ్యాయి.
* సెన్కో గోల్డ్: అత్యధికంగా 9% క్షీణించి రూ. 333 వద్ద ముగిసింది.
* కళ్యాణ్ జ్యువెలర్స్: 8% నష్టంతో రూ. 389 వద్ద స్థిరపడింది.
* టైటాన్ కంపెనీ: టాటా గ్రూప్‌కు చెందిన ఈ దిగ్గజం 5% తగ్గి రూ. 4,273 వద్ద ట్రేడ్ అయింది.
బంగారం దిగుమతులపై పన్ను వేటు, డిమాండ్ తగ్గుదల అంచనాల మధ్య గత మూడు దశాబ్దాలలో లేనంత కనిష్ట స్థాయికి ఏప్రిల్ దిగుమతులు పడిపోయే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి.
లాభాల్లో టైటాన్.. కానీ ఫలితం సున్నా
విచిత్రమేమిటంటే, ఈ కంపెనీల ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. టైటాన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.1,179 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 46 శాతం పెరిగి రూ.20,300 కోట్లకు చేరింది. ఇంతటి లాభాలు వచ్చినా ప్రధాని మోదీ వ్యాఖ్యల ప్రభావం ముందు ఈ గణాంకాలు నిలవలేకపోయాయి.
రెట్టింపు లాభంతో కళ్యాణ్ జ్యువెలర్స్
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.409.5 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది కంటే 118 శాతం ఎక్కువ. ఆదాయం కూడా 66 శాతం పెరిగి రూ.10,274 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్లు మెరుగుపడినప్పటికీ, భవిష్యత్తులో బంగారం అమ్మకాలు తగ్గుతాయన్న భయంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

