Jio IPO: భారతీయ టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్స్ గ్లోబల్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలైన మెటా, అలీబాబా, స్పేస్‌ఎక్స్ సరసన జియో చోటు సంపాదించుకుంది. ఐపీఓ సమయంలో 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఈక్విటీ వాల్యూయేషన్ సాధించిన ప్రపంచంలోని నాల్గవ కంపెనీగా జియో అవతరించింది. బుధవారం రోజున షేర్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ సంస్థ తొలి రోజే అద్భుతమైన మార్కెట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

మార్కెట్లో జియో షేర్లు ఇష్యూ ధర రూ.1,119 కన్నా ఏకంగా 21.4 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.6 లక్షల కోట్లకు ఎగబాకింది. ఫలితంగా మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలోనే రెండో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఈ పటిష్టమైన వృద్ధి కారణంగా భారత్‌లో ఎయిర్‌టెల్ కంపెనీని వెనక్కి నెట్టి నంబర్ వన్ టెలికాం బ్రాండ్‌గా జియో నిలిచింది. షేర్ల కేటగిరీలో కనీసం 23 షేర్ల లాట్ దక్కించుకున్న ప్రతి ఇన్వెస్టర్‌కు తొలి రోజే రూ.5,497 లాభం దక్కింది.

ఈ భారీ పబ్లిక్ ఆఫర్ కోసం గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. రూ.30,213 కోట్ల విలువైన ఈ ఐపీఓ ఏకంగా 22 రెట్లు పైగా సబ్‌స్క్రైబ్ అయింది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన కేవలం 95 నిమిషాల్లోనే పూర్తి కోటా భర్తీ కావడం విశేషం. మొత్తం 1.3 కోట్లకు పైగా దరఖాస్తులు రాగా, రూ.7.4 లక్షల కోట్లకు పైగా డిమాండ్ ఏర్పడింది. ఎన్ఎస్ఈ వేదికగా జరిగిన ఈ లింకింగ్ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పాల్గొని గెంగ్ మోగించి వేడుకను ఘనంగా ప్రారంభించారు.

జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ప్రస్తుతం కంపెనీకి 54 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. టెలికాం సేవలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కనెక్టెడ్ డివైజెస్‌తో పాటు స్పేస్ ఆధారిత కనెక్టివిటీ రంగానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశీ ఆపరేటర్లతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ సేవలను విస్తరించేందుకు అడుగులు వేస్తున్నారు.

Next Story