Jio Platforms IPO: రిలయన్స్ గ్రూప్ నుంచి దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒక కొత్త కంపెనీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫార్మ్స్ భారతీయ షేర్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసుకుంది. దాదాపు 4 బిలియన్ డాలర్లు అంటే రూ.37,700 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూ రాబోతోంది. ఈ దసరా పండుగ సీజన్ తర్వాత ప్రైమరీ మార్కెట్లో జియో హడావుడి మొదలుకానుంది. ఈ పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ బయటకొచ్చింది. అక్టోబర్ 12 తర్వాత కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) దాఖలు చేసే అవకాశం ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు అక్టోబర్ 19న బిడ్డింగ్ ప్రారంభమవుతుంది. ఇక సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే అక్టోబర్ 21న సబ్‌స్క్రిప్షన్ షురూ అయి అక్టోబర్ 23తో ముగుస్తుంది. అక్టోబర్ 26న షేర్ల కేటాయింపు జరిగి, అక్టోబర్ 28 నాటికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో జియో షేర్లు లిస్ట్ కానున్నాయి.

రూ.1,150 నుంచి రూ.1,220 ప్రైస్ బ్యాండ్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మెగా ఐపీఓ షేర్ ధర రూ.1,150 నుంచి రూ.1,220 మధ్య ఉండే అవకాశం ఉంది. జియో ప్లాట్‌ఫార్మ్స్ ఈ ఇష్యూ ద్వారా 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇందులో ఎటువంటి ఆఫర్ ఫర్ సేల్ భాగం లేదు. అంటే పాత ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించడం లేదు, కేవలం కంపెనీకి కొత్త నిధుల సమీకరణ మాత్రమే జరుగుతుంది. ఇదివరకు 2006లో రిలయన్స్ పెట్రోలియం లిస్టింగ్ తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న మొదటి ఐపీఓ ఇదే కావడం గమనార్హం.

హ్యుందాయ్ రికార్డులు బ్రేక్

ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.27,859 కోట్ల ఐపీఓనే అతిపెద్దదిగా ఉండేది. కానీ ఇప్పుడు జియో ప్లాట్‌ఫార్మ్స్ రూ.37,700 కోట్లతో ఆ పాత రికార్డులన్నింటినీ మట్టికరిపించబోతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇటీవల తెచ్చిన రూ.22,562 కోట్ల పబ్లిక్ ఇష్యూను కూడా దాటేసి దేశంలోనే నంబర్ 1 బిగ్గెస్ట్ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది.

అప్పుల భారం ఖాళీ.. బడా ఇన్వెస్టర్ల బలం

ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులలో సింహభాగం అంటే దాదాపు రూ.27,500 కోట్లను తమ టెలికాం సబ్సిడీ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పాత అప్పులు తీర్చడానికే వాడనున్నారు. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో మెటా (జాధూ హోల్డింగ్స్) 9.98 శాతం, గూగుల్ 7.73 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. సౌదీ అరేబియా పీఐఎఫ్, సిల్వర్ లేక్, కేకేఆర్ వంటి అంతర్జాతీయ దిగ్గజ ఫండ్స్ భాగస్వామ్యం ఈ కంపెనీకి కొండంత బలాన్నిస్తోంది.

Next Story