Jio vs NSE : ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐపీఓల సునామీ.. జియో వర్సెస్ ఎన్‌ఎస్ఈ బిగ్ ఫైట్
జియో వర్సెస్ ఎన్‌ఎస్ఈ బిగ్ ఫైట్

Jio vs NSE : భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు 2026వ సంవత్సరం ఎంతో లాభసాటిగా మారబోతోంది. దేశీయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ విలువ కలిగిన రెండు ఐపీఓలు మార్కెట్లోకి రావడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఒకవైపు దేశంలోనే అతిపెద్ద ట్రేడింగ్ వేదిక అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తన ఐపీఓను తెస్తుండగా.. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కూడా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ రెండు కంపెనీలు కూడా బిగ్గెస్ట్ ఐపీఓ అనే కిరీటాన్ని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి.
రూ.30,000 కోట్ల టార్గెట్ తో ఎన్‌ఎస్ఈ సరికొత్త ప్లాన్
భారతీయ స్టాక్ మార్కెట్ కు వెన్నెముక లాంటి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇప్పటికే తన డ్రాఫ్ట్ పేపర్లను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఎన్‌ఎస్ఈ తీసుకురాబోయే ఈ ఐపీఓ ఇష్యూ సైజు దాదాపు రూ.30,000 కోట్లుగా ఉండబోతోంది. ఈ ఐపీఓ గనుక సక్సెస్ అయితే ఎన్‌ఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.5 లక్షల కోట్ల మేజిక్ మార్కును దాటిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా డెరివేటివ్స్ ట్రేడింగ్ లో నంబర్ వన్ గా ఉన్న ఎన్‌ఎస్ఈకి ఇప్పటికే 1.8 లక్షల మంది షేర్ హోల్డర్లు ఉన్నారు. గత కొన్ని ఏళ్లుగా దేశంలో ఆప్షన్స్ ట్రేడింగ్ క్రేజ్ విపరీతంగా పెరగడం వల్ల ఎన్‌ఎస్ఈ ఆదాయం 2019 నుంచి 2026 నాటికి రెండింతలు పెరిగి రూ.18,700 కోట్లకు చేరుకుంది.
రికార్డులను తిరగరాయబోతున్న ముఖేష్ అంబానీ జియో మాస్టర్ స్ట్రోక్
ఇప్పటివరకు ఎన్‌ఎస్ఈ ఐపీఓనే దేశంలోనే అతిపెద్దది అని అందరూ అనుకుంటున్న తరుణంలో, ముఖేష్ అంబానీ తన జియోతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి రంగంలోకి దిగారు. అంతర్జాతీయ మీడియా రాయటర్స్ నివేదిక ప్రకారం.. రిలయన్స్ జియో ఐపీఓ విలువ సుమారు 4 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.37,776 కోట్లు. ఇది ఎన్‌ఎస్ఈ కంటే చాలా పెద్దది. గత ఏడాది ఆగస్టు 2025 లో జరిగిన రిలయన్స్ 48వ ఏజీఎం సమావేశంలోనే చైర్మన్ ముఖేష్ అంబానీ.. 2026 మొదటి అర్ధభాగంలో జియో ఐపీఓ మార్కెట్లోకి వస్తుందని హింట్ ఇచ్చారు. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫెరీస్ ఈ టెలికాం దిగ్గజం వాల్యుయేషన్‌ను దాదాపు 180 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.
గతంలో వచ్చిన పాత రికార్డుల పరిస్థితి ఏంటి?
భారతదేశపు ఐపీఓ మార్కెట్ లో గతంలో ఎన్నో ఎత్తుపల్లాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతానికైతే దేశంలోనే అతిపెద్ద ఐపీఓ రికార్డు హుండాయ్ మోటార్ ఇండియా పేరిట ఉంది. ఈ సంస్థ 2024 లో రూ.27,858 కోట్లు సేకరించింది. ఆ తర్వాత స్థానంలో ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ రూ.20,557 కోట్లతో నిలిచింది. అయితే ఎల్‌ఐసీ లిస్టింగ్ అయిన తర్వాత ఇన్వెస్టర్లను కాస్త నిరాశపరిచింది. ఇక 2021 లో వచ్చిన ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం రూ.18,300 కోట్ల ఐపీఓ తీసుకొచ్చినా, మార్కెట్లో భారీగా నష్టపోయి బోర్లా పడింది. ఇటీవలే 2025 లో టాటా క్యాపిటల్ కూడా రూ.15,511 కోట్లతో పెద్ద ఐపీఓను తెచ్చి సక్సెస్ అయింది.
సాధారణ ఇన్వెస్టర్లకు దీనివల్ల వచ్చే లాభం ఏంటి?
ఎన్‌ఎస్ఈ అయినా లేదా రిలయన్స్ జియో అయినా.. ఈ రెండు కంపెనీలు కూడా తమ తమ రంగాలలో తిరుగులేని మహారాజులు. ఒకటి భారతీయ స్టాక్ మార్కెట్ కు గుండెకాయ లాంటిది అయితే, మరొకటి దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన టెలికాం సామ్రాజ్యం. మార్కెట్ లోకి ఇంత పెద్ద సైజులో ఐపీఓలు రావడం వల్ల కేవలం ఆ కంపెనీలకే కాకుండా, రీటైల్ ఇన్వెస్టర్లకు కూడా దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవడానికి ఇదొక సువర్ణావకాశం అని చెప్పాలి. ఈ మెగా ఐపీఓల ఎంట్రీతో భారత మార్కెట్ లోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంది, తద్వారా మార్కెట్ లో లిక్విడిటీ పెరిగి షేర్ మార్కెట్లు మరింత లాభాల బాట పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

