కంపెనీ తీసేసే ఛాన్స్ మీరుస్తున్నట్లే

Leave Rules 2026 : 2026 సంవత్సరం మొదలవ్వడంతో ప్రైవేట్ కంపెనీల్లో కొత్త లీవ్ క్యాలెండర్లు అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది లాంగ్ వీకెండ్స్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఇప్పటికే టూర్లకు, విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సరదాగా సెలవులు పెట్టడం ఒకెత్తయితే.. అనారోగ్యం కారణంగానో లేదా ఇతర అత్యవసరాల వల్లనో సెలవులు ఎక్కువైతే ఉద్యోగం పోతుందేమో అన్న భయం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా మెడికల్ లీవ్స్ అయిపోతే పరిస్థితి ఏంటి? అన్న దానిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

కేవలం సెలవులు ఎక్కువగా తీసుకున్నంత మాత్రాన ఏ కంపెనీ కూడా ఉద్యోగిని నేరుగా తొలగించడానికి వీల్లేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది గ్రాహిత అగర్వాల్ అభిప్రాయం ప్రకారం.. అనారోగ్యంతో ఉండటం లేదా అప్పుడప్పుడు సెలవులు తీసుకోవడం దుష్ప్రవర్తన కిందకు రాదు. అయితే, ఈ సెలవులు పనిపై తీవ్ర ప్రభావం చూపుతున్నా, ఉద్యోగి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నా కంపెనీలు చర్యలు తీసుకోవచ్చు. అలా అని నోటీసు ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఉద్యోగం నుంచి తీసేయడం చట్టరిత్యా నేరం.

ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, 1947 ప్రకారం.. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఒకరిని ఉద్యోగం నుంచి తీసేస్తే దాన్ని రిట్రెంచ్‌మెంట్గా పరిగణించరు. అంటే కంపెనీ ఎటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. ఆ అనారోగ్యం నిజమైందని నిరూపించే మెడికల్ సర్టిఫికేట్లు ఉండాలి. ఉద్యోగికి కనీసం 30 రోజుల నోటీసు ఇవ్వాలి లేదా ఆ కాలానికి సరిపడా జీతం చెల్లించాలి. అంతకంటే ముందు ఉద్యోగికి తన గోడు చెప్పుకునే అవకాశం కల్పించాలి.

మీకు కేటాయించిన పెయిడ్ లీవ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా సెలవు కావాలంటే అది పూర్తిగా కంపెనీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనికి లీవ్ వితౌట్ పే అని పేరు. దీని కోసం మీరు కంపెనీకి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టంగా పేర్కొనాలి. ఆఫీస్ కి చెప్పకుండా వారం రోజులకు పైగా గైర్హాజరైతే దాన్ని అబాండన్మెంట్ ఆఫ్ సర్వీస్ గా భావించి కంపెనీ చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది.

సెలవుల విషయంలో సమస్యలు రాకూడదంటే ఎప్పుడూ పై అధికారులతో టచ్‌లో ఉండాలి. అనారోగ్యం పాలైతే వెంటనే మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలి. వీలైనంత వరకు ఫోన్ మెసేజ్‌ల కంటే అధికారిక మెయిల్స్ వాడటం మంచిది. అలాగే, నోటీసు పీరియడ్‌లో ఉన్నప్పుడు సెలవులు తీసుకుంటే సాధారణంగా కంపెనీలు రాజీనామాను ఆమోదిస్తాయి కానీ, పని అసంపూర్తిగా ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. గుర్తుంచుకోండి.. క్లారిటీగా మాట్లాడటం, డాక్యుమెంట్లు సరిగ్గా ఉంచుకోవడం మీ ఉద్యోగానికి శ్రీరామరక్ష.

PolitEnt Media

PolitEnt Media

Next Story