Child Safety : ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ టీవీల పుణ్యమా అని ఇళ్లల్లో పిల్లలు గంటల తరబడి ఓటీటీ కంటెంట్, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లలకు పనికిరాని, వారి వయసుకు మించిన అడల్ట్ కంటెంట్, హింసాత్మక వెబ్ సిరీస్‌లు కూడా చాలా సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. ఇది పిల్లల మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదృష్టవశాత్తూ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలోనే ఇటువంటి కంటెంట్‌ను బ్లాక్ చేసే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ మార్చడం ద్వారా పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో కిడ్స్ ప్రొఫైల్, పిన్ లాక్ సెట్టింగ్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‎లో పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ ఫీచర్ ఆన్ చేయడం వల్ల పిల్లల వయసుకు సరిపోయే కార్టూన్లు, విద్యాసంబంధిత షోలు మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇందులో మెచ్యూరిటీ రేటింగ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా అడల్ట్ సినిమాలు ఆటోమేటిక్‌గా హైడ్ అయిపోతాయి. అంతేకాకుండా, పిల్లలు పొరపాటున కూడా పెద్దల ప్రొఫైల్‌లోకి వెళ్లకుండా 4 డిజిట్ ప్రొఫైల్ లాక్ పెట్టుకోవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేయండి:

* మొదట నెట్‌ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లండి.

* అక్కడ ఉన్న మేనేజ్ ప్రొఫైల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

* పిల్లల పేరుతో ఒక కొత్త కిడ్స్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి.

* వీవింగ్ రెస్ట్రిక్షన్స్ లోకి వెళ్లి వయసు పరిమితిని సెట్ చేయండి.

* చివరగా ప్రొఫైల్ లాక్ సెట్ చేసి 4 అంకెల పిన్ నంబర్ క్రియేట్ చేయండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో పేరెంటల్ కంట్రోల్స్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అత్యంత పటిష్టమైన పేరెంటల్ కంట్రోల్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఒకే ప్రైమ్ అకౌంట్‌ను కుటుంబంలో చాలామంది వాడుతున్నప్పుడు ఈ సెట్టింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడల్ట్ కంటెంట్‌కు లాక్ వేయవచ్చు. ఒకవేళ పిల్లలు ఏదైనా పెద్దల సినిమా లేదా వెబ్ సిరీస్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే, మీరు సెట్ చేసిన పిన్ నంబర్ ఎంటర్ చేస్తేనే అది ప్లే అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు.

ప్రైమ్ వీడియోలో లాక్ సెట్ చేసే విధానం:

* ప్రైమ్ వీడియో యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

* మీ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేసి అకౌంట్ & సెట్టింగ్స్ లోకి వెళ్లండి.

* అక్కడ ఉన్న పేరెంటల్ కంట్రోల్స్ సెక్షన్‌ను ఓపెన్ చేయండి.

* వీవింగ్ రెస్ట్రిక్షన్స్ లోకి వెళ్లి U/A 13+, U/A 16+ లాంటి ఆప్షన్లను ఎంచుకోండి.

* కంటెంట్ లాక్ కోసం ఒక స్ట్రాంగ్ పిన్ నంబర్ సెట్ చేయండి.

యూట్యూబ్‌లో 'రెస్ట్రిక్టెడ్ మోడ్' ఆన్ చేయడం మర్చిపోకండి

ప్రపంచంలోనే అత్యధిక మంది చూసే వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్. ఇక్కడ అన్ని రకాల మంచి, చెడు వీడియోలు ఉంటాయి. అందుకే పిల్లల కోసం ఇందులో రెస్ట్రిక్టెడ్ మోడ్ అనే ఫీచర్ ఇచ్చారు. దీన్ని ఆన్ చేయడం ద్వారా అడల్ట్, హింసాత్మక, అసభ్యకరమైన వీడియోలు 90 శాతం వరకు ఫిల్టర్ అయిపోతాయి. మొబైల్ లేదా టీవీలోని యూట్యూబ్ జనరల్ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ ఉంటుంది.

యూట్యూబ్‌లో రెస్ట్రిక్టెడ్ మోడ్ ఇలా ఆన్ చేయండి:

* యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి పైన ఉండే మీ ప్రొఫైల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి.

* సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

* క్రిందికి స్క్రోల్ చేస్తే కనిపించే రెస్ట్రిక్టెడ్ మోడ్‎ను ఆన్ చేయండి.

చిన్న పిల్లల కోసం బెస్ట్ ఆప్షన్..

మీ ఇంట్లో మరీ చిన్న పిల్లలు ఉంటే సాధారణ యూట్యూబ్ యాప్‌కు బదులుగా యూట్యూబ్ కిడ్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయడం ఉత్తమం. ఇందులో కేవలం పిల్లలకు మాత్రమే ఉపయోగపడే ఫిల్టర్ చేసిన కంటెంట్ ఉంటుంది. ఈ యాప్‌లో తల్లిదండ్రులు స్క్రీన్ టైమ్ లిమిట్ కూడా సెట్ చేయవచ్చు. అంటే మీరు సెట్ చేసిన సమయం (ఉదాహరణకు 30 నిమిషాలు) అయిపోగానే యాప్ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది. ఇందులో సెర్చ్ కంట్రోల్స్, కంటెంట్ అప్రూవల్ లాంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్మార్ట్ టీవీ, మొబైల్స్ లో హోల్-డివైజ్ ప్రొటెక్షన్

కేవలం యాప్స్ లోనే కాకుండా మీరు వాడే స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ లేదా మొబైల్ డివైజ్‌లలో కూడా గ్లోబల్ పేరెంటల్ లాక్స్ ఆన్ చేయడం చాలా ముఖ్యం. ఆండ్రాయిడ్, గూగుల్ టీవీలలో కిడ్స్ మోడ్, యాప్ లాక్ ఫీచర్లు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే గూగుల్ ఫ్యామిలీ లింక్ లేదా ఆపిల్ స్క్రీన్ టైమ్ టూల్స్ ద్వారా పిల్లలు ఏ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారు, ఎంతసేపు ఇంటర్నెట్ వాడుతున్నారు అనేది మీ ఫోన్ నుంచే పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. డిజిటల్ భద్రత అనేది కేవలం యాప్స్ కే పరిమితం కాకుండా మొత్తం డివైజ్‌ను సురక్షితం చేసినప్పుడే సాధ్యమవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story