Women Empowerment : భారతదేశ మహిళలు ఇప్పుడు కేవలం వంటింటికే పరిమితం కాకుండా, వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించడంలోనూ తమ సత్తా చాటుతున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా వెలువడిన ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక. గత ఎనిమిదేళ్లలో (2017 - 2025) మహిళా రుణగ్రహీతల సంఖ్య, వారు తీసుకున్న రుణాల మొత్తం కళ్లు చెదిరే రీతిలో పెరిగింది. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా మారుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం.. 2017 నుంచి 2025 మధ్య కాలంలో మహిళల రుణ లభ్యత 5 రెట్లు పెరిగింది. మహిళలకు అందించిన మొత్తం రుణాల విలువ ఇప్పుడు రూ.76 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దేశంలోని మొత్తం సిస్టమ్-లెవల్ క్రెడిట్‌లో 26 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం. మహిళా రుణగ్రహీతల సంఖ్య ఏటా 9 శాతం (CAGR) చొప్పున పెరుగుతూ వస్తోంది. 2017లో కేవలం 19 శాతంగా ఉన్న మహిళల క్రెడిట్ వ్యాప్తి, 2025 నాటికి 36 శాతానికి చేరుకుంది.

బిజినెస్ లోన్ల వైపే మొగ్గు

ఒకప్పుడు మహిళలు కేవలం గృహ అవసరాల కోసం లేదా పర్సనల్ లోన్ల కోసం మాత్రమే బ్యాంకులను ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మొత్తం 76 లక్షల కోట్ల రుణాల్లో సుమారు పావు వంతు (25 శాతం) వ్యాపార అవసరాల కోసమే తీసుకోవడం గమనార్హం. 2017లో బిజినెస్ లోన్ల వాటా కేవలం 16 శాతంగా ఉండేది. మహిళలు వర్కింగ్ క్యాపిటల్, ఇన్వెంటరీ కొనుగోలు, యంత్ర పరికరాల విస్తరణ వంటి ఆదాయం కలిగించే పనుల కోసం తీసుకునే రుణాలు గత ఎనిమిదేళ్లలో 7.5 రెట్లు పెరగడం వారి వ్యాపార కాంక్షను తెలియజేస్తోంది.

డిజిటల్ విప్లవం, ఫైనాన్షియల్ ఇంక్లూజన్

రీటైల్ రుణాల విభాగంలో ఇప్పటికీ మహిళల వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ, మైక్రోఫైనాన్స్ రుణాలు కూడా కోలుకుంటున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్, సులభతరమైన రుణ ప్రక్రియల వల్ల మొదటిసారి లోన్ తీసుకునే మహిళల సంఖ్య బాగా పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడానికి డిజిటల్ మాధ్యమాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. రుణాలను తిరిగి చెల్లించడంలో కూడా మహిళలు క్రమశిక్షణతో వ్యవహరిస్తుండటంతో బ్యాంకులు కూడా వారికి రుణాలు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story