LIC Amrit Bal Scheme: ఎల్ఐసీ అమృత్ బాల్ స్కీమ్.. పిల్లల చదువు, పెళ్లికి డబ్బు..పూర్తి భద్రత్త ఎఫ్‌డీ కంటే ఎక్కువ రాబడి
పూర్తి భద్రత్త ఎఫ్‌డీ కంటే ఎక్కువ రాబడి

LIC Amrit Bal Scheme: ప్రతి తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో తమ పిల్లల కోసం బలమైన ఆర్థిక భద్రతను ఏర్పాటు చేయాలని కోరుకుంటారు. ఇందుకోసం చాలా మంది బ్యాంకుల్లో ఎఫ్‌డీ లేదా ఆర్‌డీలో డబ్బు పెట్టుబడి పెడతారు. అయితే, వీటిపై వచ్చే వడ్డీ రేట్లు ఇప్పుడు అంత ఆకర్షణీయంగా ఉండటం లేదు. మీ పెట్టుబడి మీ పిల్లల చదువు, కెరీర్ లేదా వివాహానికి పెద్ద అండగా మారాలని మీరు కోరుకుంటే, ఎల్ఐసీ నుంచి వచ్చిన అమృత్ బాల్ పథకం మీకు ఒక అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. ఈ ప్లాన్ సేఫ్టీతో పాటు మంచి రాబడిని కూడా అందిస్తుంది.
ఎల్ఐసీ అమృత్ బాల్ పథకం అనేది నాన్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ప్రత్యేకంగా పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ ప్లాన్‌లో తల్లిదండ్రులు పిల్లల పేరు మీద పెట్టుబడి పెడతారు. దీనికి ప్రతిఫలంగా బీమా రక్షణతో పాటు మంచి రాబడి కూడా లభిస్తుంది. ఈ పాలసీని తీసుకోవడానికి పిల్లల వయస్సు కనీసం 30 రోజులు, గరిష్టంగా 13 సంవత్సరాలు ఉండాలి. ఈ పాలసీ మెచ్యూర్ అయ్యే వయస్సును పిల్లలకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల కాలేజీ ఫీజులు, ఉన్నత విద్య లేదా కెరీర్ అవసరాలను సులభంగా తీర్చవచ్చు.
ఈ పథకంలో ప్రీమియం చెల్లింపు కోసం అనేక సౌకర్యాలు ఉన్నాయి. పాలసీదారు తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ప్రీమియంను నెలవారీ, త్రైమాసిక, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ పద్దతుల్లో కట్టుకోవచ్చు. సింగిల్ ప్రీమియం (ఒకేసారి చెల్లింపు) లేదా పరిమిత కాలానికి (5, 6 లేదా 7 సంవత్సరాలు) ప్రీమియం చెల్లించే ఆప్షన్ కూడా ఉంది.
కనీస బీమా మొత్తం రూ.2 లక్షలుగా నిర్ణయించారు, అయితే గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ప్రీమియంపై తగ్గింపు కూడా లభిస్తుంది. ఎల్ఐసీ అమృత్ బాల్ పాలసీ అత్యంత ఆకర్షణీయమైన లక్షణం ఇందులో లభించే గ్యారెంటీడ్ అడిషన్. పాలసీ అమలులో ఉన్నంత వరకు, ప్రతి సంవత్సరం చివర్లో ప్రతి రూ.1000 మూల బీమా మొత్తానికి రూ.80 చొప్పున అదనపు లాభం కూడా లభిస్తుంది. పాలసీ తీసుకునే సమయంలో పిల్లల వయస్సు 8 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, బీమా రిస్క్ కవర్ రెండు సంవత్సరాల తర్వాత లేదా పాలసీ వార్షికోత్సవం నుంచి మొదలవుతుంది. తల్లిదండ్రులకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినా, పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ఈ కవరేజ్ భరోసా ఇస్తుంది.
ఈ ప్లాన్‌లో బీమా రక్షణతో పాటు, ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పథకంలో ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ ఎంచుకునే అవకాశం ఉంది. అంటే, ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా కారణం వల్ల ప్రీమియం చెల్లించలేకపోయినా, పిల్లల పాలసీ యాక్టివ్‌గా కొనసాగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో పాలసీపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఎఫ్‌డీ లేదా ఆర్‌డీలలో రాబడి పరిమితంగా ఉంటుంది. కానీ ఈ పథకం గ్యారెంటీడ్ అడిషన్, బీమా రక్షణ రెండింటినీ అందించి, పిల్లల భవిష్యత్తుకు మంచి నిధిని సమకూరుస్తుంది.

