LIC : భారతీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు అందరూ భయపడి షేర్లను విక్రయిస్తుంటే, దేశీయ దిగ్గజ ఇన్వెస్టర్ LIC మాత్రం రివర్స్ గేర్ వేసింది. మార్కెట్ పడిపోవడాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకుని భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. మార్చి త్రైమాసికంలో భారత స్టాక్ మార్కెట్ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. చాలా కంపెనీల షేర్లు 20 శాతం నుంచి 30 శాతం వరకు పడిపోయాయి. సరిగ్గా ఇదే సమయాన్ని ఎల్ఐసీ అనుకూలంగా మార్చుకుంది. దేశంలోనే అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ఎల్ఐసీ, సుమారు రూ.18,500 కోట్లు మార్కెట్‌లో గుమ్మరించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఐఆర్ఎఫ్‌సీ వంటి బ్లూ-చిప్ కంపెనీల్లో తన వాటాలను భారీగా పెంచుకుంది.

ఈ త్రైమాసికంలో ఎల్ఐసీ అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్‌పై దృష్టి పెట్టింది. దాదాపు 19 శాతం వరకు పడిపోయిన ఈ షేరులో రూ.2,167 కోట్లు పెట్టుబడి పెట్టి 2.32 కోట్ల అదనపు షేర్లను సొంతం చేసుకుంది. అలాగే, రైల్వే రంగ ప్రభుత్వ సంస్థ IRFC షేరు 30 శాతం పడిపోయినా, ఎల్ఐసీ వెనకడుగు వేయలేదు. అందులో తన వాటాను 1.10 శాతం నుంచి ఏకంగా 2.54 శాతానికి పెంచుకుంది. దీని కోసం సుమారు రూ.2,044 కోట్లు వెచ్చించింది.

టెక్నాలజీ రంగం ఒడిదుడుకుల్లో ఉన్నా ఎల్ఐసీ నమ్మకాన్ని కోల్పోలేదు. ఇన్ఫోసిస్‌లో రూ.1,897 కోట్లు, టీసీఎస్‌లో రూ.2,143 కోట్లు పెట్టుబడి పెట్టింది. హెచ్‌ఏఎల్ షేరు 21 శాతం పతనమైన సమయంలో రూ.1,819 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటితో పాటు హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకీ, సిప్లా వంటి కంపెనీల షేర్లను కూడా ఎల్ఐసీ తన బుట్టలో వేసుకుంది. పడిపోయినప్పుడు కొని లాభాలు పండించడమే లక్ష్యంగా ఈ వ్యూహం సాగింది.

ఎల్ఐసీ వ్యూహం కేవలం కొనుగోళ్లకే పరిమితం కాలేదు. కొన్ని రంగాల నుంచి లాభాలను కూడా వెనక్కి తీసుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం నుంచి ఎల్ఐసీ పెట్టుబడులను తగ్గించుకుంది. ఎస్‌బీఐలో రూ.4,626 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లోనూ తన వాటాను స్వల్పంగా తగ్గించుకుంది. మార్కెట్ పరిస్థితిని బట్టి తెలివిగా కొన్ని చోట్ల లాభాలు స్వీకరిస్తూనే, భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉన్న షేర్లను తక్కువ ధరకే కొనేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story