LIC : ఒక్క ప్రీమియంతో మొత్తం కుటుంబానికి హెల్త్ కవరేజీ.. ఎల్ఐసీ సూపర్ ప్లాన్
ఎల్ఐసీ సూపర్ ప్లాన్

LIC : ఈ రోజుల్లో ఆసుపత్రి ఖర్చులు చాలా పెరిగిపోయాయి. అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యం వస్తే మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేయగలవు. అటువంటి సమయంలో ఆర్థిక భద్రత కల్పించడానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చాలా ముఖ్యం. ఎల్ఐసీ అందించే జీవన్ ఆరోగ్య పాలసీ మీ ఆరోగ్యానికి, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. ఇది మీ భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలను కూడా కవర్ చేస్తుంది. అంటే, ఒకే పాలసీతో కుటుంబం మొత్తం ఆరోగ్య భద్రతను పొందవచ్చు.
జీవన్ ఆరోగ్య పాలసీ అంటే ఏమిటి?
ఇది హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ప్లాన్ (Hospital Cash Benefit Plan). మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ పాలసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది వైద్య ఖర్చులను కవర్ చేయడమే కాకుండా, మీరు ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోజుకు ఒక నిర్దిష్ట మొత్తం డబ్బును చెల్లిస్తుంది. దీంతో మీరు వైద్య ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా చికిత్సపై దృష్టి పెట్టవచ్చు.
ప్రీమియం, భద్రత
ఈ పాలసీ ప్రీమియం మీ వయసు, మీరు ఎంచుకునే కవరేజ్ మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 20 ఏళ్ల యువకుడికి యాన్యువల్ ప్రీమియం సుమారు రూ.1,922.. 30 ఏళ్లవారికి రూ.2,242. 40 ఏళ్లవారికి రూ.2,799. 50 ఏళ్లవారికి రూ.3,768 వరకు ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కొంచెం ఎక్కువైనా, ఆసుపత్రి ఖర్చుల నుంచి రక్షణ పొందడం వల్ల ఇది ఒక మంచి పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఈ పాలసీని తీసుకున్న మొదటి ఐదేళ్ల తర్వాత హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ రెట్టింపు అవుతాయి.
పాలసీ వల్ల ప్రయోజనాలు
రోజూవారీ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్: ఆసుపత్రిలో చేరిన ప్రతి రోజుకు ఈ పాలసీ ఒక నిర్దిష్ట మొత్తాన్ని (ఉదా.రూ.1000 నుండి రూ.4000 వరకు) చెల్లిస్తుంది. ఈ డబ్బును మీరు 720 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.
ఐసీయూ బెనిఫిట్: ఒకవేళ మీరు ఐసీయూలో చేరితే, రోజువారీ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ కంటే రెట్టింపు మొత్తం (ఉదా. రూ.8000 వరకు) లభిస్తుంది.
సర్జికల్ బెనిఫిట్: ఏదైనా ఆపరేషన్ అవసరమైతే, సర్జరీ ఖర్చులకు కూడా ఈ పాలసీ కవరేజ్ అందిస్తుంది. ఇది ఒక సంవత్సరంలో గరిష్టంగా 5 సర్జరీలకు వర్తిస్తుంది.
అంబులెన్స్ బెనిఫిట్: అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళడానికి అయ్యే యాంబులెన్స్ ఖర్చును కూడా ఇది కవర్ చేస్తుంది (గరిష్టంగా రూ.1000 వరకు).
క్లెయిమ్ ఈజీ: క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభం. బిల్లుల ఫోటోకాపీలను సమర్పిస్తే చాలు, డబ్బులు త్వరగా లభిస్తాయి. ప్రమాదం లేదా తీవ్రమైన అనారోగ్యం అయితే, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఒక రోజులో కూడా జరగవచ్చు.
దీర్ఘకాలిక రక్షణ: ఈ పాలసీ మీకు, మీ కుటుంబానికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందిస్తుంది.
ఈ పాలసీ అన్ని వయసుల వారికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, దీనిలో కొత్త జంటలకు, కొత్తగా పుట్టిన పిల్లలకు కవరేజ్ అదనంగా జోడించే అవకాశం కూడా ఉంది. దీనితో మీరు భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన లేకుండా జీవించవచ్చు.
