LIC : లోయర్, మిడిల్ క్లాస్ కోసం ఎల్ఐసీ కొత్త స్కీమ్స్.. జన సురక్ష, బీమా లక్ష్మి పథకాలు ప్రారంభం
జన సురక్ష, బీమా లక్ష్మి పథకాలు ప్రారంభం

LIC : భారతదేశంలో ప్రజలు పొదుపు, పెట్టుబడులపై చాలా నమ్మకం ఉంచుతారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్‌ఐపి, ఈక్విటీ, గోల్డ్, సిల్వర్ ఇటిఎఫ్ లేదా పీపీఎఫ్, ఎఫ్‌డి వంటి సురక్షిత మార్గాలను ఎంచుకుంటారు. ఈ పెట్టుబడి విధానాలన్నింటిలో అందరికీ కామన్‌గా ఉండేది మంచి రాబడి పొందాలనే కోరికే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సామాన్య ప్రజల కోసం రెండు కొత్త ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించింది. ఈ స్కీమ్‌లు అక్టోబర్ 15, బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
ఈ రెండు కొత్త ఇన్సూరెన్స్ పథకాలు ప్రధానంగా తక్కువ ఆదాయ వర్గం, మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి. ఈ రెండు స్కీమ్‌లను ఎల్ఐసీ పూర్తిగా రిస్క్-ఫ్రీగా తయారు చేసింది. అంటే, ఈ పథకాలపై మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఏమాత్రం ఉండదు. సురక్షితమైన పెట్టుబడిని ఆశించే వారికి ఈ పథకాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
ఈ రెండు కొత్త పథకాలకు ఎల్ఐసీ జన సురక్ష, ఎల్ఐసీ బీమా లక్ష్మి అని పేరు పెట్టింది. ఈ రెండు స్కీమ్‌లు వేర్వేరు ఆర్థిక అవసరాలను తీర్చడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటి ద్వారా లోయర్, మిడిల్ క్లాస్ ప్రజలు సులభంగా ప్రయోజనం పొందవచ్చని ఎల్ఐసీ పేర్కొంది.
ఎల్ఐసీ జన సురక్ష పథకాన్ని ప్రత్యేకంగా తక్కువ ఆదాయ వర్గం ప్రజల కోసం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వారికి తక్కువ ఖర్చుతో కూడిన బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీని అర్థం ఏంటంటే.. ఈ పథకం మార్కెట్ హెచ్చుతగ్గులకు ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ప్రీమియం తక్కువగా ఉండటం వల్ల, లోయర్ క్లాస్ ప్రజలకు ఇది ఒక అద్భుతమైన బీమా పథకం కానుంది.
ఎల్ఐసీ బీమా లక్ష్మి పథకాన్ని మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు పొదుపు పథకం కూడా. ఎల్ఐసీ జన సురక్ష మాదిరిగానే, ఈ పథకం కూడా నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకమే. అంటే, ఇది కూడా మార్కెట్‌తో సంబంధం లేకుండా సురక్షితమైన రాబడిని అందిస్తుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారులకు జీవిత బీమా కవరేజ్ లభించడంతో పాటు, మెచ్యూరిటీ సమయంలో నిర్ణీత మొత్తం అందుతుంది.
