India China Trade : సరిహద్దు వాణిజ్యానికి గ్రీన్ సిగ్నల్.. ఉత్తరాఖండ్ మార్గం ద్వారా చైనాతో బిజినెస్ షురూ
ఉత్తరాఖండ్ మార్గం ద్వారా చైనాతో బిజినెస్ షురూ

India China Trade : భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత వ్యూహాత్మకమైన లిపులేఖ్ పాస్ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో మూతపడిన ఈ పురాతన మార్గం, సుమారు ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ తెరుచుకోనుంది. ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లా యంత్రాంగం ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ సరిహద్దు వాణిజ్యం జూన్ నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. వాతావరణం అనుకూలిస్తే ఈ గడువును మరికొంత కాలం పొడిగించే అవకాశం కూడా ఉంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో పిథోరగఢ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ భట్గాయ్ ఇప్పటికే వివిధ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వ్యాపారులు, వారి సహాయకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వివాదాల మధ్య వ్యూహాత్మక మార్గం
లిపులేఖ్ పాస్ అంటే కేవలం వ్యాపార మార్గం మాత్రమే కాదు, ఇది భారత్-నేపాల్-చైనా సరిహద్దుల కలిసే అత్యంత సున్నితమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోని లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా తమవేనంటూ నేపాల్ గతంలో వివాదానికి దిగింది. 2020లో భారత్ ఇక్కడ రోడ్డు నిర్మించినప్పుడు నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొత్త మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. అయితే, ఈ ప్రాంతం ఎప్పటి నుంచో భారత్ నియంత్రణలోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ వాణిజ్యాన్ని పునరుద్ధరించడం ద్వారా భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక పట్టును మరోసారి నిరూపించుకోనుంది.
అత్యాధునిక మౌలిక సదుపాయాలు
సుమారు 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ మార్గంలో గతంలో సరుకులను గుర్రాలు, మేకల మీద తీసుకెళ్లేవారు. కానీ 2020లో పూర్తిస్థాయి మోటార్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు రవాణా చాలా సులభం కానుంది. గుంజి వాణిజ్య కేంద్రం వద్ద బ్యాంకింగ్ సేవలు, కస్టమ్స్ క్లియరెన్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్, పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊపు
లిపులేఖ్ మార్గం తెరుచుకోవడం వల్ల కేవలం భారీ వ్యాపారులకే కాకుండా స్థానిక గిరిజన తెగలకు, చిన్న తరహా వర్తకులకు కూడా ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా టిబెటన్ ఉత్పత్తులు, ఉన్ని వస్త్రాలు, మూలికల వ్యాపారానికి ఈ మార్గం చాలా కీలకం. గత ఏడాది ఇదే మార్గం గుండా కైలాస మానస సరోవర్ యాత్ర కూడా ప్రారంభం కావడంతో, పర్యాటక రంగం కూడా పుంజుకునే అవకాశం ఉంది. సరిహద్దుల్లో వాణిజ్యం బలోపేతం కావడం వల్ల భారత్-చైనా మధ్య ఆర్థిక సంబంధాల్లో కూడా కొంత సానుకూలత ఏర్పడవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

