CEIR Portal India : పోగొట్టుకున్న మొబైల్ తిరిగి పొందడం ఎలా? CEIR పోర్టల్‌తో ఫోన్ దొంగలకు చెక్
CEIR పోర్టల్‌తో ఫోన్ దొంగలకు చెక్

CEIR Portal India : మీ మొబైల్ ఫోన్ పోతే లేదా దొంగతనానికి గురి అయితే, సిమ్ తీసివేస్తే ఇక దానిని తిరిగి పొందలేమని భావించడం సహజం. చాలామంది సిమ్ కార్డును బ్లాక్ చేసి, కొత్త సిమ్ తీసుకుని సైలెంటుగా ఉండిపోతారు. కానీ, దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌ను కూడా తిరిగి రికవరీ చేయవచ్చనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇందుకోసమే కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఒక ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. అదే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR). ఈ పోర్టల్ ద్వారా మీ ఫోన్ వివరాలు నమోదు చేస్తే, పోలీసులు దానిని సులభంగా ట్రాక్ చేసి, మీకు తిరిగి అప్పగించే అవకాశం ఉంది.
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) అనేది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ద్వారా నిర్వహించబడే పోర్టల్. ఇది కొత్తగా వచ్చిన పోర్టల్ కాదు, కొన్ని సంవత్సరాలుగా అందుబాటులో ఉంది. ఈ పోర్టల్‌లో మీ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ వివరాలను, ముఖ్యంగా దాని IMEI (International Mobile Equipment Identity) నంబర్‌ను నమోదు చేస్తే, దొంగతనానికి గురి అయిన ఫోన్‌ను పోలీసులు ట్రాక్ చేయగలుగుతారు. సిమ్ తీసివేసినా లేదా కొత్త సిమ్ వేసినా, IMEI నంబర్ ద్వారా ఫోన్‌ను సులభంగా గుర్తించవచ్చు.
2023 మే 16 నుండి ఇప్పటివరకు, ఈ పోర్టల్‌లో 50 లక్షలకు పైగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లు రికార్డయ్యాయి. వీటిలో 31 లక్షల ఫోన్‌లు బ్లాక్ చేశారు. 19 లక్షల మొబైల్ ఫోన్‌లు ట్రాక్ అయ్యాయి. 4.22 లక్షల ఫోన్‌లు వాటి యజమానులకు తిరిగి అప్పగించబడ్డాయి. 2024 మార్చి నుంచి 2025 అక్టోబర్ వరకు, బెంగళూరు పోలీసులు CEIR పోర్టల్‌లో నమోదైన 894 దొంగిలించబడిన ఫోన్‌లను ట్రాక్ చేశారు. వాటిలో 522 ఫోన్‌లను ఇప్పటికే యజమానులకు తిరిగి ఇచ్చారు.
CEIR పోర్టల్‌లో నమోదు చేయవలసిన వివరాలు
మీరు మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే లేదా దొంగిలించబడితే, CEIR పోర్టల్‌లో (www.ceir.gov.in) ఈ క్రింది వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి:
⦁ మొబైల్ వివరాలు:
⦁ పోయిన ఫోన్ మొబైల్ నంబర్ (రెండు సిమ్ స్లాట్‌లు ఉంటే రెండింటి నంబర్లు).
⦁ రెండు సిమ్ స్లాట్‌ల IMEI నంబర్లు (ఇది చాలా ముఖ్యం).
⦁ ఫోన్ బ్రాండ్ (Samsung, Apple, Vivo, etc.), మోడల్, ధర.
⦁ ఫోన్ కొనుగోలు చేసిన ఇన్వాయిస్ (బిల్లు) డాక్యుమెంట్ (తిరిగి పొందడానికి ఇది చట్టపరమైన ఆధారం).
దొంగతనం వివరాలు:
⦁ ఫోన్ పోయిన స్థలం, తేదీ, రాష్ట్రం, జిల్లా, పోలీస్ స్టేషన్, పోలీస్ కంప్లైంట్ నంబర్ (FIR నంబర్).
యజమాని వివరాలు:
⦁ యజమాని పేరు, చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు (ID Proof), ఇమెయిల్ ఐడి.
ప్రక్రియ, భద్రత
మీరు ఈ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు మీ ఫోన్‌ను ట్రాక్ చేయడం ప్రారంభిస్తారు. దొంగిలించబడిన ఫోన్‌లో ఎవరైనా వేరే సిమ్ వేసి ఉపయోగించినప్పటికీ, IMEI నంబర్ ద్వారా ఆ ఫోన్ లొకేషన్ వివరాలు పోలీసులకు సులభంగా తెలిసిపోతాయి. దొంగతనం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. అలాగే, మొబైల్ కొనుగోలు చేసిన ఇన్వాయిస్ బిల్లును భద్రపరచుకోవడం చాలా ముఖ్యం.

