12 అంకెల PPO నంబర్ పోయిందా? నిమిషాల్లో తిరిగి పొందే మార్గాలివే

EPFO : ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రతి నెలా వచ్చే పెన్షన్ అనేది వృద్ధాప్యంలో ఒక పెద్ద ఆసరా. అయితే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికీ 12 అంకెలతో కూడిన ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. దానినే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటారు. చాలామంది ఈ నంబర్‌ను ఎక్కడో డైరీలో రాసి మర్చిపోతుంటారు లేదా ఆ కాగితం పోగొట్టుకుంటారు. పెన్షనర్లకు ఇది ఆధార్ కార్డు కంటే కూడా చాలా ముఖ్యం. మరి ఈ నంబర్ పోతే పెన్షన్ ఆగిపోతుందా? దీన్ని మళ్ళీ తిరిగి పొందడం ఎలా? అనే వివరాలు తెలుసుకుందాం.

పీపీఓ నంబర్ ఎందుకు అంత ముఖ్యం?

EPFO ఇచ్చే ఈ 12 అంకెల సంఖ్య కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, అది పెన్షనర్ అసలైన గుర్తింపు కార్డు. మీకు ఎంత పెన్షన్ రావాలి, అది ఏ బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్ళాలి అనేది ఈ నంబర్ ఆధారంగానే డిసైడ్ అవుతుంది. పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు అకౌంట్ మార్చుకోవాలన్నా ఈ నంబర్ తప్పనిసరి. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతి ఏటా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఈ పీపీఓ నంబర్ ఖచ్చితంగా కావాలి. ఇది లేకపోతే మీ పెన్షన్ ప్రాసెస్ ముందుకు సాగదు.

నంబర్ పోతే పెన్షన్ ఆగిపోతుందా?

చాలామంది పీపీఓ నంబర్ పోగానే వెంటనే పెన్షన్ ఆగిపోతుందని కంగారు పడుతుంటారు. కానీ వాస్తవానికి మీ బ్యాంక్ అకౌంట్ ఇప్పటికే ఈపీఎఫ్ఓ సిస్టమ్‌తో లింక్ అయి ఉంటుంది కాబట్టి, నంబర్ పోయినంత మాత్రాన ప్రతి నెలా వచ్చే పెన్షన్ ఆగిపోదు. అయితే, అసలు చిక్కు ఎప్పుడు వస్తుందంటే.. మీరు ఏటా ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ టైమ్ వచ్చినప్పుడు. ఆ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంక్ పెన్షన్ ఆపేస్తుంది. అలాగే మీ పెన్షన్ అకౌంట్‌లో ఏదైనా మార్పులు చేయాలన్నా ఈ నంబర్ లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

ఆన్‌లైన్‌లో చిటికెలో వెతికేయండి

డిజిటల్ ఇండియా పుణ్యమా అని ఇప్పుడు పీపీఓ నంబర్ తెలుసుకోవడం చాలా సులభం. మీరు ఈ మూడు పద్ధతుల్లో మీ నంబర్‌ను తిరిగి పొందవచ్చు:

* EPFO పోర్టల్: ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి Know your PPO No అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా ఈపీఎస్ మెంబర్ ఐడీ ఇస్తే చాలు, మీ పీపీఓ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

* UMANG యాప్: మీ ఫోన్‌లో ఉమంగ్ యాప్ ఉంటే, అందులో ఈపీఎఫ్ఓ సర్వీసెస్‌లోకి వెళ్లి పెన్షనర్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ ఆధార్ లేదా బ్యాంక్ వివరాలు ఇచ్చి నిమిషాల్లో నంబర్ తెలుసుకోవచ్చు.

* డిజీలాకర్ : మీ పీపీఓ సర్టిఫికెట్‌ను ఒరిజినల్ కాపీలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ మార్గం. ఇందులో Employees Provident Fund Organisation అని సర్చ్ చేసి మీ వివరాలు ఇస్తే చాలు, డిజిటల్ సర్టిఫికేట్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది.

ఆఫ్‌లైన్ పద్ధతి కూడా ఉంది

స్మార్ట్‌ఫోన్ వాడటం రాని వృద్ధులకు ఆఫ్‌లైన్ మార్గం కూడా అందుబాటులో ఉంది. మీరు మీ పెన్షన్ ఏ బ్యాంకులో అయితే పడుతుందో, ఆ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మీ సేవింగ్స్ అకౌంట్ నంబర్ చెబితే చాలు. బ్యాంక్ రికార్డుల్లో మీ పీపీఓ నంబర్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి, అధికారులు వెంటనే ఆ నంబర్‌ను మీకు ఇస్తారు. కాబట్టి పీపీఓ నంబర్ పోయిందని కంగారు పడకుండా, ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ పెన్షన్ పక్కాగా అందుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story