LPG Crisis : గ్యాస్ టెన్షన్ వద్దు.. ఎల్పీజీ ఉత్పత్తి 40% పెంపు.. కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్
కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్

LPG Crisis : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దేశీయంగా ఇంధన కొరత లేకుండా పెట్రోలియం మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రిఫైనరీలు తమ పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని, దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిని ఏకంగా 40 శాతం పెంచామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల సామాన్యులకు గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఇంధన కొరత ఏర్పడవచ్చని భయపడాల్సిన పని లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలు ఇప్పుడు తమ గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ఎల్పీజీ ఉత్పత్తిని 40 శాతం మేర పెంచామని ఆమె తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి సరఫరా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అయినా, ఎక్కడా గ్యాస్ కొరత లేదని ఆమె నొక్కి చెప్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిరంతరం గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
డిజిటల్ బుకింగ్‌తో పారదర్శకత.. తగ్గిన పానిక్ బుకింగ్
యుద్ధం వస్తోంది అనగానే సాధారణంగా ప్రజలు భయంతో అడ్వాన్స్ బుకింగ్‌లు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఈ ట్రెండ్ తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 55 లక్షల రీఫిల్ బుకింగ్ అభ్యర్థనలు వచ్చాయి. ముఖ్యంగా 93 శాతం బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుండటంతో గ్యాస్ పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా పోయింది. ప్రతి సిలిండర్ అథెంటికేషన్ కోడ్ ద్వారా సురక్షితంగా కస్టమర్‌కు అందుతోంది. దీనివల్ల సిలిండర్ ఎప్పుడు వస్తుందో కస్టమర్ సులభంగా ట్రాక్ చేయగలుగుతున్నారు.
నల్లబజారుపై ఉక్కుపాదం.. 4,500 దాడులు
గ్యాస్ సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. సరైన పంపిణీ జరిగేలా చూసేందుకు గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 4,500 చోట్ల తనిఖీలు, దాడులు నిర్వహించారు. మరోవైపు, ప్రజలు క్రమంగా పైపుడ్ నేచురల్ గ్యాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. టాప్ 15 భౌగోళిక ప్రాంతాల్లో సుమారు 13,700 మందికి పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చారు. ఇందులో 7,500 మంది కస్టమర్లు ఎల్పీజీని వదిలి పీఎన్‌జీకి మారడం విశేషం. కమర్షియల్ అవసరాల కోసం కూడా ఇప్పటివరకు 11,300 టన్నుల ఎల్పీజీని సరఫరా చేశారు.
సముద్ర మార్గంలో మన నౌకలు, నావికులు భద్రం
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఉన్నా, భారతీయ నౌకలకు ఎలాంటి ముప్పు లేదని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ సిన్హా తెలిపారు. ఆ మార్గంలో ఉన్న మన 22 నౌకలు, వాటిలోని 611 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రభుత్వం నిరంతరం వారిని పర్యవేక్షిస్తోందని, గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 25 మంది నావికులు క్షేమంగా భారతదేశానికి చేరుకున్నారు. రేవుల్లో ఎలాంటి రద్దీ లేదని, సరఫరా గొలుసు సజావుగానే సాగుతోందని ఆయన వెల్లడించారు.

