LPG eKYC : గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట..ఈ-కేవైసీ పై కేంద్రం కీలక ప్రకటన
ఈ-కేవైసీ పై కేంద్రం కీలక ప్రకటన

LPG eKYC : గ్యాస్ సిలిండర్ వాడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పెద్ద ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎల్పీజీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ గురించి రకరకాల వార్తలు వస్తుండటంతో ప్రయాణికుల్లో, సాధారణ ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా కేవైసీ చేసుకోవాలని, లేదంటే గ్యాస్ రాదని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. ఈ నిబంధన కేవలం ఇప్పటివరకు ఒక్కసారి కూడా కేవైసీ పూర్తి చేయని వారికి మాత్రమే వర్తిస్తుందని, అందరికీ కాదని కేంద్రం తేల్చి చెప్పింది.
ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల విషయంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఉజ్వల కనెక్షన్ ఉన్నవారు ఏడాదికి కేవలం ఒక్కసారి మాత్రమే ఈ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కూడా వారు ఏడు సిలిండర్లు వాడేసిన తర్వాత, 8వ, 9వ రీఫిల్ పైన సబ్సిడీ పొందాలంటే ఈ అథెంటికేషన్ అవసరమవుతుంది. అంతేకాని ప్రతి నెలా లేదా ప్రతి గ్యాస్ బుకింగ్ సమయంలోనూ బయోమెట్రిక్ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఈ కేవైసీ ప్రక్రియ కోసం గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన పని లేదని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి వద్దే ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కేవైసీ ప్రక్రియ వల్ల గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని, మునుపటిలాగే డెలివరీ కొనసాగుతుందని అధికారులు భరోసా ఇచ్చారు. పారదర్శకతను పెంచడానికి, అర్హులైన వారికే సబ్సిడీ అందేలా చూడటానికే ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఆధార్ కేవైసీ ప్రధాన ఉద్దేశ్యం నకిలీ కనెక్షన్లను ఏరివేసి, సబ్సిడీ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడటమే. చాలా చోట్ల గ్యాస్ సిలిండర్లను అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కేవైసీ ద్వారా ప్రతి కనెక్షన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల అర్హత లేని వారిని సిస్టమ్ నుంచి తొలగించడం సులభం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సబ్సిడీ భారం తగ్గడమే కాకుండా, సామాన్యులకు సకాలంలో గ్యాస్ అందుతుందని భావిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి కంగారు పడవద్దని కేంద్రం కోరింది.

