LPG : మార్చి 23 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ కష్టాల నుంచి విముక్తి
హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ కష్టాల నుంచి విముక్తి

LPG : దేశంలో కొనసాగుతున్న గ్యాస్ సంక్షోభం మధ్య కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ రాష్ట్రాల కమర్షియల్ గ్యాస్ కోటాను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 23, 2026 నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం, గ్యాస్ సరఫరాలో ఉన్న ఇబ్బందులు చాలా వరకు తొలగిపోనున్నాయి. అయితే ఈ వెసులుబాటు పొందాలంటే వ్యాపారులు కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
అదనపు గ్యాస్ ఎవరికి దక్కుతుంది?
పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో అదనపు కోటా కేటాయింపులపై క్లారిటీ ఇచ్చారు. ఈ అదనపు 20 శాతం గ్యాస్ సరఫరాలో సామాన్య ప్రజలకు సేవలు అందించే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, డైరీ ప్రాసెసింగ్ యూనిట్లకు ముందుగా గ్యాస్ అందుతుంది. అలాగే, ప్రభుత్వాలు నిర్వహించే రాయితీ క్యాంటీన్లు, సామాజిక వంటశాలలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వలస కూలీల కోసం 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను కూడా ప్రభుత్వం ఖాయం చేసింది.
50 శాతం మార్కుకు చేరుకున్న సరఫరా
గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రాలకు కేవలం 20 శాతం కమర్షియల్ ఎల్పీజీ మాత్రమే కేటాయించేవారు. అయితే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలకు మార్చి 18న మరో 10 శాతం అదనపు కోటా ఇచ్చారు. ఇప్పుడు మార్చి 23 నుంచి ఇచ్చే మరో 20 శాతంతో కలిపి మొత్తం కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో 50 శాతానికి చేరుకున్నాయి. దీనివల్ల మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల కొరత చాలా వరకు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ గ్యాస్ పక్కదారి పట్టకుండా, నల్లబజారుకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.
గ్యాస్ కావాలంటే ఈ రెండు షరతులు పాటించాల్సిందే
పెంచిన కోటాను అందుకోవడానికి వినియోగదారులు రెండు ముఖ్యమైన నిబంధనలను పాటించాలి. మొదటిది, అన్ని కమర్షియల్, ఇండస్ట్రీయల్ వినియోగదారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాపార సంస్థకు ఏటా ఎంత గ్యాస్ అవసరమవుతుంది? ఏ రంగంలో వాడుతున్నారు? వంటి పూర్తి వివరాలతో డేటాబేస్ సిద్ధం చేస్తారు. రెండోది, అత్యంత ముఖ్యమైనది.. కమర్షియల్ వినియోగదారులు తమ నగరంలోని గ్యాస్ పంపిణీ సంస్థ వద్ద పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
పీఎన్‌జీ వైపు అడుగులు వేయక తప్పదు!
భవిష్యత్తులో ఎల్పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, అందరినీ పైపుల ద్వారా వచ్చే గ్యాస్ నెట్వర్క్కి మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే, ఎవరైతే పీఎన్‌జీ కోసం దరఖాస్తు చేసుకుని, సాంకేతికంగా సిద్ధంగా ఉంటారో వారికి మాత్రమే ఈ పెంచిన కోటా వర్తిస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సాంప్రదాయ సిలిండర్ల నుంచి పర్యావరణహితమైన పైపు గ్యాస్ కు వ్యాపారులను మళ్లించే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వ్యాపారులకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, నిరంతరాయంగా గ్యాస్ సరఫరా పొందే అవకాశం ఉంటుంది.

