LPG : ముగిసిన గ్యాస్ కష్టాలు.. యుద్ధం మధ్యలో భారత్‌కు చేరిన ఎల్పీజీ నౌక.. ఇక సిలిండర్ల పండగే
ఇక సిలిండర్ల పండగే

LPG : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా భారత్‌లో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరతకు తెరపడనుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో, గ్యాస్‌తో వస్తున్న నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర లైన్లు, సిలిండర్ల కోసం గొడవలు, హోటళ్లు మూతపడటం వంటి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే భారత ప్రభుత్వం చేసిన దౌత్య ప్రయత్నాలు ఫలించడంతో ఎట్టకేలకు గ్యాస్ ట్యాంకర్లు భారత్‌కు చేరుకున్నాయి.
యుద్ధం ముమ్మరంగా సాగుతున్న సమయంలోనే భారత్‌కు చెందిన గ్యాస్ నౌక శివాలిక్ సురక్షితంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఈ భారీ ట్యాంకర్‌లో దాదాపు 54 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఇది దేశంలోని గ్యాస్ డిమాండ్‌ను చాలా వరకు తీరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నౌకతో పాటు నందా దేవి అనే మరో నౌక కూడా హోర్ముజ్ జలసంధిని దాటిందని, అది ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికల్లా భారత తీరానికి చేరుకుంటుందని సమాచారం. ఈ రెండు నౌకలు వస్తే దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత దాదాపుగా తొలగిపోతుంది.
ఈ సంక్షోభ సమయంలో భారత్, ఇరాన్ మధ్య ఉన్న బలమైన స్నేహబంధం మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలోని ఇతర దేశాల నౌకలను హోర్ముజ్ మార్గంలో అనుమతించని ఇరాన్, భారత్‌ను తన మిత్ర దేశంగా పేర్కొంటూ మన నౌకలకు సేఫ్ ప్యాసేజ్ కల్పించింది. భారత్ లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ కూడా ఇరు దేశాల ప్రయోజనాలు ఒకటేనని, భారత్ పట్ల తాము ఎల్లప్పుడూ స్నేహపూర్వక వైఖరినే అవలంబిస్తామని స్పష్టం చేశారు. ఈ దౌత్య విజయం వల్లే యుద్ధ విమానాలు తిరుగుతున్నా మన గ్యాస్ నౌకలు సురక్షితంగా బయటపడగలిగాయి.
గత కొన్ని రోజులుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ దొరకక జనం అల్లాడిపోతున్నారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సిలిండర్ల పంపిణీ వద్ద గొడవలు జరగకుండా పోలీసులు పహారా కాయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా చోట్ల జనం ఇండక్షన్ స్టౌవ్‌ల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు శివాలిక్ నౌక ముంద్రా పోర్టుకు చేరుకోవడంతో గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లకు సరఫరా మొదలై, రెండు మూడు రోజుల్లోనే ఇంటింటికీ సిలిండర్లు అందే అవకాశం ఉంది. సామాన్య ప్రజలకు ఇది నిజంగా పెద్ద ఊరటనిచ్చే తీపి కబురు.

