LPG Supply : వంట గ్యాస్ టెన్షన్ తీరినట్టే.. హోర్ముజ్ జలసంధి దాటిన భారత ఎల్‌పీజీ నౌకలు
హోర్ముజ్ జలసంధి దాటిన భారత ఎల్‌పీజీ నౌకలు

LPG Supply : పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర మార్గంలో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చమురు, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్ తన వంట గ్యాస్ అవసరాల కోసం 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న తరుణంలో, ఈ యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందేమోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ఊరటనిచ్చే ప్రక్రియను చేపట్టింది. భారత గ్యాస్ నౌకలు సురక్షితంగా ఉన్నాయని, సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.
భారత నౌకలు సురక్షితం.. గ్యాస్ లోడ్ రెడీ
పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, భారత గ్యాస్ నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే రెండు భారీ నౌకలు హోర్ముజ్ స్ట్రెయిట్‌ను విజయవంతంగా దాటేశాయి. ఈ నౌకల్లో మొత్తం 92,612 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ ఉంది. ఈ షిప్పుల్లో 60 మంది భారతీయ నావికులు పని చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ మధ్యలో ఇవి భారత తీరాలకు చేరుకోనున్నాయి. దీంతో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు.
పన్ను వసూలు వార్తలపై క్లారిటీ
సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ అక్రమంగా పన్నులు లేదా ఫీజులు వసూలు చేస్తోందంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతర్జాతీయ సముద్ర నిబంధనల ప్రకారం ఏ దేశానికీ ఇటువంటి ఫీజులు వసూలు చేసే హక్కు లేదని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ సిన్హా స్పష్టం చేశారు. అటువంటి వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని, భారత నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణిస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం హోర్ముజ్ ప్రాంతంలో భారత జెండా కలిగిన 20 నౌకలు ఉన్నాయని, వాటన్నింటితో ప్రభుత్వం టచ్‌లో ఉందని పేర్కొన్నారు.
నిరంతర నిఘా.. 5 ట్యాంకర్లు సిద్ధం
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న 20 భారత నౌకల్లో 5 ట్యాంకర్లు పూర్తిగా ఎల్‌పీజీ గ్యాస్‌తో నిండి ఉన్నాయి. వీటిలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. ఇవి రానున్న రోజుల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. మరో నౌకలో లోడింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. యుద్ధ వాతావరణం దృష్ట్యా కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, సంబంధిత ఏజెన్సీలు నిరంతరం పరిస్థితిని గమనిస్తున్నాయి. దేశీయంగా ఎల్‌పీజీ సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
దౌత్యపరమైన వ్యూహం.. శాంతి కోసం భారత్ కృషి
కేవలం నౌకల రక్షణే కాకుండా, ప్రాంతీయ శాంతి కోసం భారత్ తన దౌత్య మార్గాలను ఉపయోగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇప్పటికే వివిధ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు. అమెరికా ప్రతినిధులు, శ్రీలంక విదేశాంగ మంత్రితో కూడా పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించినట్లు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తెలిపారు. చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని, తద్వారా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు దెబ్బతినకుండా చూడాలని భారత్ బలంగా కోరుతోంది.

