గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై చెప్పి ఇండక్షన్ వైపు జనం క్యూ

LPG vs Induction : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటిళ్లలో కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో భారత్‌లో ఎల్పీజీ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యూయర్‌ స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం భయపడాల్సిన పనిలేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. సామాన్యులు మాత్రం ప్రత్యామ్నాయాల వేటలో పడ్డారు. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ కంటే విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టౌవ్ వాడటమే చౌక అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని వెనుక ఉన్న అసలు లెక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇండక్షన్ వైపు పరుగులు తీస్తున్న జనం

గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లో ఆలస్యం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో మెట్రో నగరాల్లో ఇండక్షన్ స్టౌవ్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లలో ఇండక్షన్లు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. గ్యాస్ ధరలు పెరగడం ఒక కారణమైతే, ఎప్పుడు సిలిండర్ అయిపోతుందో అన్న భయం ప్రజలను కరెంట్ పొయ్యిల వైపు నడిపిస్తోంది. అయితే, ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. అసలు గ్యాస్ స్టౌవ్ వాడటం లాభమా? లేక ఇండక్షన్ వాడటం లాభమా?

శాస్త్రీయంగా ఇండక్షనే బెటర్

మనం గ్యాస్ స్టౌవ్ మీద వంట చేసేటప్పుడు మంట నుంచి వచ్చే వేడిలో సుమారు 60 శాతం గాలిలో కలిసిపోతుంది. అంటే మనం పెట్టే ఖర్చులో కేవలం 40 శాతం మాత్రమే వంట వండటానికి ఉపయోగపడుతుంది. కానీ ఇండక్షన్ స్టౌవ్ అలా కాదు. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సూత్రంపై పనిచేస్తుంది. వేడి నేరుగా పాత్ర అడుగు భాగానికి చేరుతుంది. దీనివల్ల ఇండక్షన్ 90 శాతం సమర్థతతో పనిచేస్తుంది. అంటే ఇందులో ఇంధనం లేదా విద్యుత్ వృథా అనేది దాదాపు సున్నా.

డబ్బులు ఎంత ఆదా అవుతాయి?

ఢిల్లీలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.913 గా ఉంది. ఒక సిలిండర్ ఇచ్చే వేడిని ఇండక్షన్ ద్వారా పొందాలంటే సుమారు 78 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ ధర రూ.8గా వేసుకున్నా.. నెలకు మీ కరెంట్ బిల్లు రూ.624 మాత్రమే పెరుగుతుంది. అంటే గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే నెలకు దాదాపు రూ.300 ఆదా చేయవచ్చు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ లేదా తక్కువ ధరలు ఉన్న చోట ఈ ఆదా ఇంకా ఎక్కువగా ఉంటుంది.

హోటళ్లకు ఎందుకు కష్టం?

ఇంట్లో వాడుకోవడానికి ఇండక్షన్ బాగున్నప్పటికీ, హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికీ గ్యాస్‌నే నమ్ముకుంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. కమర్షియల్ ఇండక్షన్ స్టౌవ్‌ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి (దాదాపు రూ.3.5 లక్షల వరకు). అలాగే, హోటళ్లకు భారీ విద్యుత్ లోడ్ అవసరమవుతుంది, దీనికి అదనపు ఖర్చులు ఉంటాయి. పవర్ కట్ అయినప్పుడు జనరేటర్ల మీద ఇండక్షన్లు నడపడం కూడా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే కమర్షియల్ కిచెన్లలో ఎల్పీజీకే మొగ్గు చూపుతున్నారు. కానీ సామాన్య గృహ వినియోగదారులకు మాత్రం ఇండక్షన్ ఒక వరమనే చెప్పాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story